కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. స్టూడెంట్ల మెస్​ బిల్లులు ఆపుతారా?

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. స్టూడెంట్ల మెస్​ బిల్లులు ఆపుతారా?

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలోని స్టూడెంట్లకు10 నెలలుగా మెస్ బిల్లులు చెల్లించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. వివిధ పనుల కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. స్టూడెంట్ల మెస్​బిల్లులు ఆపడం ఎంతవరకు కరెక్ట్​అన్నారు. మెస్ బిల్లులను తిరస్కరించిన ఫైనాన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్టూడెంట్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం విద్యానగర్ నుంచి బీసీ భవన్ వరకు సంక్షేమ హాస్టళ్ల స్టూడెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. 

మెస్​బిల్లులు ఆపడంతో హాస్టళ్లకు వ్యాపారులు సరుకులు ఇవ్వడం లేదన్నారు. స్టూడెంట్లకు నాణ్యమైన ఫుడ్​అందడం లేదని, ఆకలితో అలమటిస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలోని 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవు, ప్రభుత్వం స్పందించి వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే మెస్ బిల్లులు చెల్లించడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లకు చదువును దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ర్యాలీలో నీల వెంకటేశ్, నందగోపాల్, రాజ్ కుమార్, జిలపల్లి అంజి, భాస్కర్ ప్రజాపతి తదితర నాయకులు పాల్గొన్నారు.