Paytm News: పేటీఎంకు సుప్రీం ఊరట.. రూ.5వేల 712 కోట్ల GSTపై స్టే.. సోమవారం స్టాక్ దూకుడే!

Paytm News: పేటీఎంకు సుప్రీం ఊరట.. రూ.5వేల 712 కోట్ల GSTపై స్టే.. సోమవారం స్టాక్ దూకుడే!

Paytm GST: పేటీఎం కంపెనీని విజయ్ శేఖర్ శర్మ ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారో తెలియదు కానీ కంపెనీ గడచిన రెండేళ్ల నుంచి వరుసగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. రిజర్వు బ్యాంక్ దాని బ్యాంకింగ్ లైసెన్స్ క్యాన్సిల్స్ చేయటం నుంచి జీఎస్టీ నోటీసులు, ఫైన్లు అంటూ అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది. ఫిన్ టెక్ రంగంలో పెద్ద విప్లవానికి నాందిపలికిన శర్మ వ్యాపారం ప్రస్తుతం ఇతర పోటీదారుల కంటే కొంత వెనుకబడిన సంగతి తెలిసిందే. 

వాస్తవానికి పేటీఎంకి చెందిన గేమింగ్ విభాగం ఫస్ట్ గేమ్స్ టెక్నాలజీ సంస్థకు జీఎస్టీ అధికారులు జనవరి 2018 నుంచి మార్చి 2023 మధ్య కాలానికి పన్నులతో పాటు జరిమానా మెుత్తం రూ.5వేల 712 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన కంపెనీకి తాజాగా రిలీఫ్ లభించింది. తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు పేర్కొంది. కోర్టు ప్రస్తుతం ప్రకటించిన తీర్పుతో సోమవారం పేటీఎం షేర్లు లాభపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో పేటీఎం స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.844 వద్ద ఉంది.

ALSO READ | PF News: పీఎఫ్ సభ్యులకు శుభవార్త.. వడ్డీ రేటులు ఫిక్స్, త్వరలో జమ..

వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గేమింగ్ కంపెనీలు సైతం పన్ను అధికారుల నుంచి ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. Games24X7, Dream11, Head Digital Works లాంటి సంస్థలు సైతం ఇప్పటికీ జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నాయి. వాస్తవానికి ఎంట్రీ మెుత్తంపై జీఎస్టీ మెుత్తాన్ని 18 శాతం కాకుండా 28 శాతం కింద లెక్కిస్తూ జీఎస్టీ అధికారులు నోటీసులు పంపటంతో ఆందోళనలు మెుదలయ్యాయి. చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమకు వచ్చిన ఆదాయంపై మాత్రమే జీఎస్టీ లెక్కించాలని, బెట్టింగ్ వేసిన మెుత్తాలపై కాదని వారు వాదిస్తున్నారు. 

ఇటీవల ఆర్థిక ఫలితాలను ప్రకటించిన పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ నాల్గవ త్రైమాసికానికి నికర నష్టం రూ.544.6 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఇది గడచిన ఏడాది ఇదే కాలంలో కంపెనీ నమోదు చేసిన నష్టం కంటే 1 శాతం తక్కువ మాత్రమే. ఇదే కాలంలో కంపెనీ ఆదాయాలు వార్షిక ప్రాతిపధికన 15.68 శాతం క్షీణించి రూ.వెయ్యి 911కోట్ల 50 లక్షలుగా నమోదైనట్లు పేటీఎం ప్రకటించింది.