NOC ఇచ్చేది లేదు.. పాక్ క్రికెటర్‌కు షాకిచ్చిన పీసీబీ

NOC ఇచ్చేది లేదు.. పాక్ క్రికెటర్‌కు షాకిచ్చిన పీసీబీ

టీ20 బ్లాస్ట్‌లో ఆడాలనుకున్న పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ గట్టి షాకిచ్చింది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో మీర్ టీ20 బ్లాస్ట్‌ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే టీ20 బ్లాస్ట్‌లో ఈ పాక్ లెగ్ స్పిన్నర్.. వోర్సెస్టర్‌షైర్ తరుపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

మూడే లీగులు.. 

గతేడాది ఇదే విషయమై పాకిస్తాన్ క్రికెటర్లు.. పీసీబీ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ సమయంలో పీసీబీ.. సెంట్రల్‌ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లందరూ ఒక్కో సీజన్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో పాటు రెండు ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లు ఆడేందుకు అనుమతించబడ్డారు. దానిపై సంతకం చేసిన ఆటగాళ్లలో మీర్ కూడా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక సైకిల్‌లో ఒక ఆటగాడు పీఎస్ఎల్, రెండు విదేశీ లీగులు ఆడుకోవచ్చు. ఒకవేళ అందుకు అంగీకరించకపోతే, రిటైర్మెంట్ ప్రకటించాక వారి ఇష్టం. కాకపోతే, ఈ లెగ్ స్పిన్నర్ ఇప్పటికే మూడు లీగులు ఆడేశాడు అన్నది పీసీబీ అధికారుల వాదన. 

జులై 1, 2023 నుండి జూన్ 30, 2024 వరకు కొనసాగే అతని ప్రస్తుత కాంట్రాక్టు సైకిల్‌లో అతను మరిన్ని టీ20 లీగ్‌లు ఆడేందుకు అనర్హుడని పోసీబీ తెలిపింది. మీర్ 2023 ఆగస్టులో హండ్రెడ్ లీగ్, 2023-24లో బిగ్ బాష్ లీగ్‌ ఆడాడు. అనంతరం ఈ ఏడాది జూన్ లోపు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాడు. దీంతో అతని మూడు లీగులు పూర్తయ్యయి. ఎన్‌ఓసీ ఇవ్వడానికి పీసీబీ నిరాకరించింది. అయితే, ఇక్కడే ఓ మెలిక ఉంది.

మధ్యలోనే స్వదేశానికి మీర్

ఉసామా మీర్ సీజన్ మొత్తం బిగ్ బాష్ లీగ్‌‌లో పాల్గొనలేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఉండటంతో పీసీబీ ఆతని మధ్యలోనే స్వదేశానికి రప్పించింది.  కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే ఆడాడు. దీంతో మరో లీగ్‍లో ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని మీర్ బోర్డును ఆశ్రయించాడు.

2024 పీఎస్ఎల్ సీజన్‌లో ముల్తాన్ సుల్తాన్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మీర్ నిలిచాడు. కానీ అప్పటి నుండి విదేశీ టీ20 లీగ్‌లు ఆడలేదు. గత సీజన్‌లో వోర్సెస్టర్‌షైర్‌ తరుపున మీర్.. 11 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అలాగే, ఆరు ఇన్నింగ్స్‌లలో 162.96 స్ట్రైక్ రేట్‌తో 132 పరుగులు చేశాడు.