జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో సర్వే నిర్వహించి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టపరంగా ముందుకెళ్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. మున్నూరు కాపు నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి జూబ్లీహిల్స్‌లో బలహీనవర్గాల బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలిపించుకోవాలని కోరారు. కోకాపేటలో మున్నూరు కాపుల కోసం భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్‌లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, రానున్న రోజుల్లో నవీన్ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడ్తామన్నారు. అంతకుముందు కృష్ణ కాంత్ పార్కులో మహేశ్ గౌడ్, పొన్నం కలిసి మార్నింగ్ వాక్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. నవీన్ యాదవ్‌కు ఓటేసి గెలిపించాలని వాకర్స్‌కు కోరారు. ఈ కార్యక్రమాల్లో విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు శ్యామ్ మోహన్, అనిల్, వినయ్, ఆకుల లలిత, కేకే మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సత్తు మల్లేశ్ పాల్గొన్నారు.
