కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయిస్తరా? లేదా? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయిస్తరా? లేదా? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 
  • మోదీ హైదరాబాద్ వచ్చేలోపు సంజయ్ సమాధానం చెప్పాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 
  • బండి సంజయ్ కేంద్ర మంత్రి అని మర్చిపోయి మాట్లాడుతున్నడని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్నందున.. ఆ లోపే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయిస్తరో..లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని చెప్పామని.. సీబీఐ విచారణ జరపాలని కోరితే ఎందుకు వెనుకాడుతున్నారో సంజయ్ చెప్పాలన్నారు.

మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్​గౌడ్​ మాట్లాడారు. ‘ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నేతలే చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విచారణ జరిపించడం లేదు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదు. తుపాకీ మా భుజాలపై పెట్టి కాల్చాలని బండి సంజయ్ చూస్తుండు. సీబీఐ మీ చేతుల్లోనే ఉంది.

విచారణ చేయకుండా మమ్మల్ని బద్నాం చేయడం ఏంటి’ అని ప్రశ్నించారు. సంజయ్ కేంద్ర మంత్రిలా వ్యవహరించడం లేదన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే 48 గంటల్లో దర్యాప్తు జరిపిస్తామని చెప్పి, 8 నెలలు గడిచినా ఎందుకు  చేయించడం లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో చేసుకున్న లోపాయికారి ఒప్పందంతోనే రాష్ట్రంలో బీజేపీకి ఆ పార్టీ 8 సీట్లను ఇచ్చిందన్నారు. 

రైతులపై బీఆర్ఎస్​ నేతలది మొసలి కన్నీరు

‘వరి వేస్తే.. ఉరే’ అన్నవాళ్లే ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మహేశ్​గౌడ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వరి కల్లాల చుట్టు తిరుగుతున్న వారు.. గతంలో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ తో మా ప్రభుత్వానికి పోలికే లేదని చెప్పారు.

బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వరి కల్లాల వద్ద చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బెంగాల్ తరహాలో తెలంగాణలో గెలుస్తామంటే అది ఇక్కడ కుదరదన్నారు. బెంగాల్ లో బీజేపీ గెలిచే అనుకూల వాతావరణం లేకపోయినా అధికారంలోకి వచ్చిందంటే ‘సర్’ పేరుతో భారీ ఎత్తున ఓట్లను తొలగించడమేనని ఆరోపించారు. అక్కడ జరిగిన ఎన్నికల తీరు పలు అనుమానాలకు తావిస్తున్నదన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ‘సర్’ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరి ఓట్లను వారే కాపాడుకునే ప్రయత్నం చేయాలని మహేశ్​గౌడ్​కోరారు.