హైదరాబాద్, వెలుగు: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌పై ఎలాంటి కేసులు ఉన్నాయో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు.
శుక్రవారం గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వారి చిత్ర పటాలకు పూల మాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అజారుద్దీన్‌పై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు ఎందుకంత అక్కసు అని ఫైర్ అయ్యారు.
అజార్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మూడు నెలల ముందే హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ కాలం దేశానికి ఆయన సేవలందించారని, ఈ నేపథ్యంలో అజార్ విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్‌గా దేశానికి అజారుద్దీన్ ఎన్నో విజయాలు సాధించి పెట్టారని, ఎంపీగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలోని మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
