
- ఎన్నారై బతుకమ్మ వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, వెలుగు: దళారుల ఆట కట్టించేందుకు త్వరలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం పీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు చీఫ్ గెస్టులుగా మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గల్ఫ్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రజా ప్రభుత్వం ఉందని తెలిపారు. ముఖ్యంగా దుబాయ్, మస్కట్‌లో తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో మోసపోతున్నారని చెప్పారు. 2014లోనే బతుకమ్మ ఆటా పాటా ప్రారంభమైందని, అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పండుగను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని మండిపడ్డారు.
బతుకమ్మ ఆటను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు రాష్ట్రంలో రోజుకో చోట జరుగుతున్నాయని చెప్పారు. రూరల్ ఏరియాలో కాంగ్రెస్ తరఫున ప్రజాప్రతినిధులు లేరని, అందుకే పార్టీ కార్యకర్తలు ముందుండి ప్రభుత్వం చేసే ఏర్పాట్లకు సహకరించాలని కోరారు.