- రూ. 5 వేలు తీసుకొని బీఆర్ఎస్కు ఓటెయ్యండని అనడం ఏమిటి?
- పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
- ఈసీకి ఫిర్యాదు చేస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి రూ. 5 వేలు తీసుకొని బీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. ‘‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలడంతో కేటీఆర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది. పదేండ్లు ఆ పార్టీ చేసిన దోపిడీని జనం మరిచిపోలేదు” అని తెలిపారు.
శనివారం యూసుఫ్ గూడలోని కాంగ్రెస్ ఎన్నికల ఆఫీసులో మీడియాతో మహేశ్‌గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని.. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని, బీజేపీకి వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని అన్నారు. ‘‘మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 8 సీట్లు గెలుచుకునేందుకు బీఆర్ఎస్ సహకరించింది.
ఇప్పుడు బీఆర్ఎస్ రుణం తీర్చుకునేందుకు బీజేపీ బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలిపింది. ‘అహనా పెళ్లంట’ సినిమా బీఆర్ఎస్ కు సరిపోతుంది. అందులో కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లుగా పదేండ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని ఆశల్లో బతికేలా చేసింది” అని ఆయన పేర్కొన్నారు
బీసీ బిడ్డకు చాన్స్ ఇస్తే ఆడిపోసుకోవడమేంది?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మహిళా సెంటిమెంట్ ను బీఆర్ఎస్ తెరపైకి తెస్తున్నదని, మహిళల గురించి మట్లాడే నైతికత ఆ పార్టీకి ఎక్కడ ఉందని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. "ఐదేండ్లు మహిళా మంత్రి లేకుండా నీచపు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్.. ఈ బైపోల్ లో గెలుపు కోసం మహిళా సెంటిమెంట్ వాడడం ఏమిటి?
బై పోల్ లో బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే బీఆర్ఎస్ ఇంతగా ఆడిపోసుకోవడం దేనికి? నవీన్ యాదవ్ ఒక్క తప్పు చేసినట్లు నిరూపించగలరా? అనవసరంగా బట్టకాల్చి ఆయనపై వేయడం సరైంది కాదు" అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిదని, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతుందని ఆయన తెలిపారు.
