హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు బీజేపీ కక్షపూరిత చర్యలో భాగమేనని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు.‘‘అవి ఈడీ రెయిడ్స్ కాదు.. బీజేపీ దాడులు” అని ఘాటుగా విమర్శించారు.
శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఈడీ ద్వారా బీజేపీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఇలాంటి దాడులను రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటామన్నారు.హైడ్రా కూల్చివేతలతో నష్టపోతున్నపేదలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించు కున్న బడా బాబులు, రియల్టర్ల దగ్గరి నుంచి తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవడమే హైడ్రా అసలు లక్ష్యమన్నారు.
రాజీనామా భయంతోనే హరీశ్ డ్రామాలు..
రైతు రుణమాఫీ అంశంపై సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియట్ ను ముట్టడిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. తాను రాజీనామా చేయాల్సి వస్తుందన్న భయంతోనే హరీశ్ రావు సెక్రటేరియట్ ముట్టడి అంటూ డ్రామాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇప్పటికే దాదాపు 23 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేశామన్నారు. ఇది వాస్తవమా? కాదా? హరీశ్‌రావు చెప్పాలన్నారు.
