బతుకమ్మ పాటలతో రాజకీయాలా?: మహేశ్ కుమార్ గౌడ్

బతుకమ్మ పాటలతో  రాజకీయాలా?: మహేశ్ కుమార్ గౌడ్

 

  • బీఆర్ఎస్​పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్ 
  •     ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగం కావాలని మహిళలకు పిలుపు
  •     ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ సంబరాలు: మంత్రి జూపల్లి


హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ పండుగను కూడా కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  కాంగ్రెస్​ సర్కారును విమర్శిస్తూ రాసిన పాటలను తెలంగాణ భవన్​లో ఆవిష్కరించడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం గాంధీ భవన్ లో మహేశ్​గౌడ్ మీడియాతో  మాట్లాడారు. 

రాష్ట్రంలో ఐదారేండ్ల నుంచే బతుకమ్మ ఆట, పాట మొదలైనట్లు కొందరు అపోహ పడుతున్నారని, కానీ ఇది తరతరాలుగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్న పండుగ అని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ కార్యక్రమాలను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ నెల 21 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రముఖ కళాకారులతో బతుకమ్మ పాటలను రూపొందిస్తున్నామన్నారు. 21న వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందన్నారు. 27న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించేలా 63 అడుగుల ఎత్తుతో బతుకమ్మను పేర్చి10 వేల మంది ఆట, పాటల్లో పాల్గొనేలా కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.