
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు చాన్స్ లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, పార్టీలు మారిన వారి గురంచి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన నిజామాబాద్ ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారని, వారంతా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని, ప్రతి నెలా పార్టీ మెంబర్ షిప్ ఫీజు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
ఉప ఎన్నికలు వచ్చే చాన్స్ ఉండదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, రిజర్వేషన్ సాధించాకే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్లడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చి తీరుతామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీసీల పట్ల ప్రేమ ఉంటే మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ తలుచకుంటే ఒక్క రోజులోనే రిజర్వేషన్ అమలులోకి వస్తుందన్నారు. కామారెడ్డి సభను దసరా పండుగ తరువాత నిర్వహిస్తామన్నారు. అనంతరం లైబ్రరీని విజిట్ చేసి యువతతో మాట్లాడారు. ఉత్తర తిరుపతి ఆలయాన్ని సందర్శించి ఎస్జీఎస్ పద్మావతి అన్నదాన, ఇందూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. లైబ్రరీ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాంభూపాల్ ఉన్నారు.