
- పీసీసీ, డీసీసీ నేతలతో జూమ్‌మీటింగ్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం సాయంత్రం డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీసు బేరర్లతో మహేశ్‌గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల పాలనలో బీసీలను అణగదొక్కారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్చట్టాల్లో 50 శాతం పరిమితి ఇప్పుడు బీసీలకు మరణ శాసనంగా మారిందని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీ కమిషన్ వేసి లెక్కలు తేల్చామని, అసెంబ్లీ, మండలిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బిల్లు ఆమోదించి గవర్నర్ కు పంపించామని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ కోసం ఆర్డినెన్స్ తెచ్చామని, అది కూడా గవర్నర్ ఆమోదించకపోవడంతో ఆదివారం మళ్లీ రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకున్నామని చెప్పారు.
దీన్ని కాంగ్రెస్ నాయకులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విస్తృతంగా ప్రజలకు వివరించాలని కోరారు. గడిచిన 20 నెలల కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.