తెలంగాణలో12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

తెలంగాణలో12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పార్టీపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికే బీఆర్ఎస్ పెట్టారని, ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని ఆరోపించారు. 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బలోపేతమయ్యారని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందన్నారు. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. 

తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఒక భాగమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదని, రాష్ట్ర ప్రజలు ఈ విషయం గురించి ఆలోచించాలన్నారు. ‘కేసీఆర్ లాంటి దుష్టశక్తి నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోండి. దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టండి. నేను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటా. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. ఇక తెలంగాణతో కేసీఆర్ కు రుణం తీరిపోయింది’ అని అన్నారు. రాష్ట్రంలో12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.