ఎన్నికల హామీలు ఏమైనై.. బీజేపీ, టీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి ప్రశ్న

ఎన్నికల హామీలు ఏమైనై.. బీజేపీ, టీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి ప్రశ్న

మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టిఆర్ఎస్ లు మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడనుకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. విదేశాల నుంచి నల్లధనం  తెచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో  రూ. 15 లక్షలు జమ చేస్తామని మోసం చేశారన్నారు.  ప్రతియేటా 2  కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. పార్లమెంట్ లో తాను అడిగిన ప్రశ్న కు కేవలం  22 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారని రేవంత్ చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. నిరుద్యోగ సమస్యపై సరైన చర్యలు తీసుకోలేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగినా కూడా..వాటిని  నియంత్రించి పేదలను అడుకోలేదని రేవంత్ రెడ్డి చురకలంటించారు. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని చెప్పారు.

 
చర్చనా… రచ్చనా…!? బీజేపీ - టీఆర్ఎస్ వైఫల్యాలా… వ్యక్తిగత పంచాయితీలా!?

చర్చనా… రచ్చనా…!? బీజేపీ - టీఆర్ఎస్ వైఫల్యాలా… వ్యక్తిగత పంచాయితీలా!? నికార్సైన కాంగ్రెసోడా డిసైడ్ చేద్దాం…రా! #ManaMunugodeManaCongress

Posted by Anumula Revanth Reddy on Sunday, August 14, 2022

హామీలను గాలికొదిలేశారు..
ఉప ఎన్నికలు రాగానే కేసీఆర్  ప్రజలపై ప్రేమ ఒలకపోస్తారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. పేదకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,  దళితులకు మూడు ఎకరాల భూమి,  ఇంటికో ఉద్యోగం హామీలు గెలిచాకా గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల రావడంతో..మరోసారి  ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరాడని ఆరోపించారు. ఎన్నికల హామీని నెరవేర్చని బీజేపీ, టీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రజల పక్షాన ఈ రెండు పార్టీల ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. ప్రశ్నించే గొంతుక కాంగ్రెస్  అని.. ప్రజలు పార్టీ పక్షాన నిలబడాలని కోరారు.

బీజేపీ, టీఆర్ఎస్కు బుద్ది చెప్పాలి..
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ , ట్రిపుల్ ఐటీ, జాతీయ హోదా సాగునీటి ప్రాజెక్టులు, గిరిజన యూనివర్సిటీ హామీల గురించి టిఆర్ఎస్ పోరాటం ఎందుకు చెయ్యడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై పోరాటం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కేంద్రంలోని  బీజేపీ వైఫల్యాలు ఎండగట్టాలన్నారు. కమ్యూనిస్టు లు, టీజేఎస్ చీఫ్ కోదండరాం తో కలుపుకుని పోరాడాలని కోరారు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ ను  గెలిపించి ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, టిఆర్ఎస్ లకు  సరైన బుద్ది చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.