టీఆర్ఎస్, బీజేపీ కలిసి పన్నిన కుట్రనే ‘ఫాంహౌస్’ ఘటన 

టీఆర్ఎస్, బీజేపీ కలిసి పన్నిన కుట్రనే ‘ఫాంహౌస్’ ఘటన 

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్, బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ధి పొందుతున్నాయని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఈలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఇలానే రెండు పార్టీలు వ్యవహరించాయని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులతో దాడులు చేయించి.. ఆయనకు సానుభూతి కలిగేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. కేసీఆర్ ను ఓడించాలనే ఉద్దేశంతో చాలామంది ఓటర్లు రఘునందన్ రావుకు ఓట్లు వేసి ఆయన్ను గెలిపించారని చెప్పారు. రఘునందన్ రావుతో పాటు ఆయన బంధువులపై పెట్టిన కేసులు దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఏమయ్యాయని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటెల రాజేందర్ పై కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసిందని చెప్పారు. ఆ సమయంలో కేవలం పోటీలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉన్నట్లుగా రెండు పార్టీలు చిత్రీకరించాయని, పోటీలో అసలు కాంగ్రెస్ పార్టీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిపొందాయని ఆరోపించారు. హుజురాబాద్ ఉప  ఎన్నిక ముందు ఈటెల రాజేందర్ పై పెట్టిన కేసులు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్, బీజేపీ పన్నిన కుట్ర

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఢిల్లీలో అమిత్ షా, రాష్ట్రంలో కేసీఆర్ మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ను శత్రువుగా చేసుకుని కుట్ర పన్నాయని అన్నారు. తాను మునుగోడులో 8 రోజుల క్రితం చెప్పినట్లుగానే ఇలాంటి కుట్రలు జరిగాయన్నారు. నవంబర్ 3న ఉప ఎన్నికతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్రను పక్కదారి పట్టించడానికే ఫామ్ హౌస్ రాజకీయాలు నడిపించారని ఆరోపించారు. ఇదంతా కేసీఆర్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫామ్ హౌస్ రాజకీయాలు కొత్తేమీ కాదన్నారు. కేవలం ముగ్గురిపై మాత్రమే కేసులు పెట్టి.. నలుగురు ఎమ్మెల్యేలపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ముగ్గురి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేసినప్పుడు, ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదన్నారు. ఈ కేసులో పోలీసులు వన్ సైడ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాక్ష్యాధారాలను విధ్వంసం చేసేందుకు స్వయంగా పోలీసులే నలుగురు ఎమ్మెల్యేలను భద్రత మధ్య ప్రగతిభవన్ లో విడిచిపెట్టారని ఆరోపించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేలు కనిపించడం లేదని, అసలింతకు వాళ్లు ఉన్నారా..? లేరా..? అని ప్రశ్నించారు. 

కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదు

రెచ్చగొట్టి లోబర్చుకోవాలని చూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నేరస్తులే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కూడా ముద్దాయిలుగా కేసుల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కుట్ర వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. స్వామిజీలతో పాటు నందకుమార్ పాత్రధారులేనని ఆడియోలను బట్టి అర్ధమవుతోందన్నారు. ఎమ్మెల్యేలను విడిచిపెట్టి డమ్మీలను అరెస్ట్ చేసి, వారిపై కేసులు పెట్టారనంటూ మండిపడ్డారు. ఫామ్ హౌస్ కేసు విచారణలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో పాత్రధారులైన వారందరిపైనా కేసులు పెట్టి విచారించాలన్నారు. ఇప్పటి వరకూ ఫాం హౌస్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మినిష్టర్, డీజీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఫాం హౌస్ కేసులో దొరికిన వస్తువులను కోర్టులో ఏమేమీ సమర్పించారో పోలీసులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.  ఫాంహౌస్ లోని ఆడియోలు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..  పోలీసులే ఆడియోలను బయటపెట్టారా..? అని ప్రశ్నించారు. ఫాంహౌస్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఆడియో రికార్డులు బయటకు ఎలా వచ్చాయి..? 
కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ కలిసి సమన్వయంతో నడుస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యూహాత్మకంగానే రెండు పార్టీలు వివాదం సృష్టించి.. రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలను ప్రజలే గమనించి.. తిప్పి కొట్టాలని చెప్పారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన ఆడియో రికార్డుల ప్రకారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ముగ్గురు వ్యక్తులను డబ్బులు అడుగుతున్నారని, మిగతా ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తానని బేరం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్టు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. ఈ విషయం సీపీ స్టీఫెన్ రవీంద్రకు తెలియదా..? అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో ఏసీబీ నడుస్తోందన్నారు. ఈ కేసు విచారణకు ఫాం హౌస్ లోని సెల్ ఫోన్స్, అక్కడి సీసీ కెమెరాలే కీలకమన్నారు. సెల్ ఫోన్లను సీజ్ చేస్తే ఆడియో రికార్డులు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా అని అన్నారు.