పేదలకు ధరణి పోర్టల్​ యమపాశంలా మారింది

పేదలకు ధరణి పోర్టల్​ యమపాశంలా మారింది
  • సీఎం పంటను ఎవరు కొంటరో.. వాళ్లే రైతుల పంటనూ కొనాలె: రేవంత్​రెడ్డి
  • గజ్వేల్​ నియోజకవర్గంలో సాగిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర

మెదక్/ మనోహరాబాద్​, వెలుగు: రైతులు పండించిన వడ్లను చివరి గింజ వరకు కొనాల్సిందేనని, లేకపోతే  కేసీఆర్​ సంగతి చూస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘యాసంగిలో రైతులను వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ తన ఫామ్​హౌస్ లో మాత్రం 150 ఎకరాలలో వరి వేసిండు. ఆయన పంట ఎవడు కొంటాడో.. వాడే పేద రైతుల వరి కూడా కొనాలె” అని డిమాండ్​ చేశారు.  ‘‘రైతులకు ఓ నీతి.. నీకో నీతా?” అని సీఎంను ప్రశ్నించారు.  రైతుల కడుపుకొట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్​ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర శనివారం సీఎం కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​ నియోజకవర్గ పరిధిలోని మనోహరాబాద్​ మండలం కాళ్లకల్​కు  చేరుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన వడ్లను కొనకపోతే గజ్వేల్​ నడిబొడ్డున సీఎం కేసీఆర్​ను ఉరితీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు దాదాపు 40 లక్షల ఎకరాల్లో వరి పండించారని చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్, మూడో టీఎంసీ మల్లన్నసాగర్​, కొండపోచమ్మ సాగర్​ కోసం వేలాది ఎకరాలు గుంజుకుని పేద రైతుల బతుకులు రోడ్డుపాలు చేసిన వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. ఆయన మాత్రం ఎర్రవల్లిలో 500 ఎకరాల భూమి కొనుక్కొని అక్కడ శత్రుదుర్భేద్యమైన గడి నిర్మించుకుని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నడు” అని మండిపడ్డారు. మల్లన్నసాగర్​ కోసం 14 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాలు ముంచి పేదలు, దళితులు, గిరిజనులను నిర్వాసితులను చేశారని అన్నారు. కొండపోచమ్మ సాగర్​ కట్టి ఎవరికి నీళ్లివ్వడం లేదని, కేసీఆర్​ ఫాంహౌస్​కు నీళ్లిచ్చేందుకు మాత్రం ప్రత్యేక కాల్వ తవ్వారని దుయ్యబట్టారు. సీఎం బంధువు కావేరి సీడ్స్ యజమాని భూమి మునగకుండా జలాశయాన్ని రీడిజైన్ చేశారని రేవంత్​ ఆరోపించారు. మల్లన్నసాగర్​, కొండపోచమ్మసాగర్​ కోసం వేలాది ఎకరాలు గుంజుకోగా, ఇప్పుడు రీజినల్​ రింగ్​ రోడ్డు కోసం పేదల భూములు మళ్లీ గుంజుకునే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు మూడు, ఐదు కోట్లు పలుకుతున్న భూములకు ప్రభుత్వం  రూ.1‌‌‌‌0 లక్షలు బిచ్చం ఇస్తామంటోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలన్నారు. కేసీఆర్ ఫామ్​హౌస్​లో 500 ఎకరాలు భూమి ఉందని, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున తీస్కొని ఆ భూమిని ఇక్కడ భూములు కోల్పోయిన వారికి పంచాలని డిమాండ్​ చేశారు. పెట్టుబడి దారులకోసం, భూస్వాముల కోసం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తూతూ మంత్రంగా రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూములు గుంజుకోవడంపై కాంగ్రెస్​ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు.

భూ మాఫియా చెలరేగిపోతున్నది

రాష్ట్రంలో భూ మాఫియా చెలరేగిపోతున్నదని, జంట నగరాల్లో తుపాకీ తూటాలు పేలుతున్నాయని రేవంత్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న ధరణి పోర్టల్​ పేదలకు యమపాశంలా తయారైందని, ఈ పోర్టల్  తీసుకొచ్చి లక్షలాది కుటుంబాలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను వారసులకు బదిలీ చేయకుండా నరకం చూపిస్తున్నారని తెలిపారు.