సెప్టెంబర్ 17న మేం జాతీయ జెండా ఎగరేస్తాం : ఉత్తమ్

సెప్టెంబర్ 17న మేం జాతీయ జెండా ఎగరేస్తాం : ఉత్తమ్

తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రెస్ లో జాయిన్ కావాలని కోరారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్… ఈనెల 17 వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా జాతీయ జెండా ఎగరేస్తామన్నారు. అదే రోజున పీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఏఐసీసీ సమావేశంలో చర్చించిన అంశాలపై ఈ మీటింగ్ లో చర్చిస్తామన్నారు. సభ్యత్వ నమోదు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నాయకులతో డిస్కస్ చేస్తామన్నారు ఉత్తమ్. ఎన్నికలతో సంబంధం లేకుండా కార్యకర్తలకు  శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2 వతేదీన మహాత్ముడి 150 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నామన్నారు. ప్రధాని మోడీ కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ మొత్తం రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తున్నారని అన్నారు. మన్మోహన్ సింగ్ చెప్పినట్టు విద్యార్థులకు ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుందన్నారు. పీసీసీ సభ్యులతో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతాయని ఎవరు ఊహించలేదన్నారు ఉత్తమ్.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు వార్షిక బడ్జెట్ కు 6 నెలలలో రూ.36 వేల కోట్ల బడ్జెట్ తగ్గిందనీ.. SC, ST, BCలకు   బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారని అన్నారు ఉత్తమ్. ఎన్నికలు హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేశాడని అన్న ఉత్తమ్.. రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని సీఎంను ప్రశ్నించారు. యువత ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. కనీసం 16 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. మహారాష్ట్ర లో మరాఠాలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టు…. తెలంగాణ  రాష్ట్రంలో 50 శాతం పైగా బీసీలు  ఉన్నారు కాబట్టి వారికి 50 శాతం పైగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. తాము మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు, మైనార్టీ లకు ఇస్తామని చెప్పారు పీసీసీ చీఫ్.