
అమ్మవారి ప్రసాదంలో పాము దర్శనమిచ్చిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది.. తమిళనాడులోని హోసూర్ లో కొండపై కొలువైన చంద్ర చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో చోటు చేసుకుంది ఈ ఘటన. నిత్యం వందలాది మంది అమ్మవారి దర్శనం కోసం వచ్చే ఈ గుడిలో ఇలాంటి ఘటన జరగటంతో అంతా షాక్ అయ్యారు. ఈ గుడిలో అమ్మవారి భక్తులకు పులిహోర, పెరుగన్నం ప్రసాదంగా ఇస్తారు. అలా.. బెంగళూరు చెందిన ఓ భక్తురాలు ప్రసాదం పులిహోర ప్యాకెట్ తీసుకున్నారు.. తిందామని ప్యాకెట్ ఓపెన్ చేయగానే ప్యాకెట్ లో పాము పిల్ల కళేబరం ఉండటంతో షాక్ అయ్యింది భక్తురాలు.
ఈ ఘటనపై ప్రసాదం కౌంటర్ సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాదానం ఇచ్చినట్లు తెలిపారు భక్తులు. దీంతో ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు భక్తురాలు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించటంతో ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
ప్రసాదాల తయారీ కేంద్రంలో పరిశీలించి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు అధికారులు. నిర్లక్ష్యం గా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు.