ఫిరాయింపులను సహించొద్దు.. వేటు వేయాల్సిందే: పీసీసీ

ఫిరాయింపులను సహించొద్దు.. వేటు వేయాల్సిందే: పీసీసీ
  • రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్​ వేటు వేయాల్సిందే
  • ప్రత్యర్థి పార్టీల మైండ్​ గేమ్​పై అప్రమత్తంగా ఉందాం
  • పీసీసీ సమావేశంలో నేతల నిర్ణయం
  • పొన్నం కన్వీనర్​గా మున్సి‘పోల్స్’ వ్యూహానికి కమిటీ
  • 29న నాగార్జున సాగర్​లో కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ

పార్టీ ఫిరాయింపులను ఏమాత్రం సహించేది లేదని, పార్టీ మారే వారి విషయంలో కఠినంగానే వ్యవహరించాలని పీసీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు నిన్నటి వరకు టీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ ఆర్సీ కుంతియా అధ్యక్షతన పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పార్టీ నేతలు జానారెడ్డి, చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, హర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన ఈ భేటీలో ఫిరాయింపులు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైనే ప్రధాన చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని, ఆయన ఎలాగో పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నందున వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని సమావేశంలో నేతలు చర్చించుకున్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీపై, నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఇక ఏమాత్రం సహించవద్దని, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరణ చర్యలు చేపట్టాలని నేతలు సూచించినట్లు తెలిసింది. ఇలాంటి వారిపై నాన్చుడు ధోరణి అవలంబిస్తే పార్టీలోని ఇతర నేతలు కూడా క్రమశిక్షణను తేలిగ్గా తీసుకునే ప్రమాదం ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు రోజుల్లో రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ లేదంటే బహిష్కరణ చేసేలా హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోవాలని సమావేశంలో  చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్​ సీనియర్లు పార్టీ మారనున్నట్లు ప్రత్యర్థి పార్టీలు మైండ్ గేమ్ ఆడనున్నాయని, అలా ప్రచారంలో ఉన్న పేర్లకు సంబంధించిన నాయకులు వెంటనే ఆ ప్రచారాన్ని ఖండించాలని నేతలు సూచించారు. లేకపోతే క్యాడర్ అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

మున్సి‘పోల్స్​’ వ్యూహానికి కమిటీ

త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​ అనుసరించబోయే వ్యూహాన్ని ఖరారు చేసేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కన్వీనర్ గా ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డితో  ఓ కమిటీని వేయాలని పీసీసీ సమావేశం నిర్ణయించింది. ఈ నెల 29న నాగార్జునసాగర్ లో  పీసీసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని, ఇందులో డీసీసీ అధ్యక్షులతోపాటు ఏఐసీసీ బాధ్యులను పిలువాలని నిర్ణయించారు. ఖాళీగా ఉన్న పార్టీ నియోజకవర్గాల్లో వారం రోజుల్లో బాధ్యులను నియమించాలని, రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలకు పార్టీ పరంగా ఇన్​చార్జులను నియమించాలని సమావేశంలో  తీర్మానించారు. మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్ల నమోదును పార్టీ సీరియస్ గా తీసుకోవాలని, 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఉండాలని సమావేశం పేర్కొంది. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్​గాంధీ నాయకత్వం అవసరమని, ఆయన ఏఐసీసీ అధ్యక్షులుగా కొనసాగాలని, ఆయన చేసిన రాజీనామాను ఉపసంహారించుకోవాలని సమావేశం తీర్మానించింది. ఇకపై పీసీసీ చీఫ్‌‌ అనుమతి లేకుండా ఎవరూ విలేకరుల సమావేశం పెట్టొద్దని, పార్టీ అంశాలు అధ్యక్షుల అనుమతితోనే వెల్లడించాలని ఉత్తమ్‌‌ సూచించారు.

ముసలివారికి పగ్గాలు ఇవ్వొద్దు: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

యాదగిరికొండ, వెలుగు: పనిచేసే వాళ్లకు పగ్గాలు ఇవ్వకుండా ముసలివారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం సబబు కాదని కాంగ్రెస్ హైకమాండ్​కు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ మీద ఎలాంటి దురుద్దేశంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి మాట్లాడడం లేదని ఆయన అన్నారు.  యాదగిరిగుట్టలో ఆదివారం కాంగ్రెస్​ నూతన జడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో వెంకట్​రెడ్డి మాట్లాడారు.  రాజగోపాల్​రెడ్డి ఆస్తులు, పరిశ్రమల మీద సీఎం కేసీఆర్​ కన్నేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే హైకమాండ్​ పర్మిషన్ తీసుకుని రాష్ట్రంలో పాదయాత్ర కానీ, బైక్​ యాత్ర కానీ, బస్సుయాత్ర  కానీ చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకువస్తామన్నారు.

ఎప్పుడు చూసినా టోపీ పెట్టుకొనే..

ఇచ్చిన హామీలను అమలు చేయడంతో సీఎం కేసీఆర్​ విఫలమయ్యారని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శించారు. ‘‘ఎప్పుడు చూసినా టోపీ పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ తిరుగుతున్నాడు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మన ఆలేరు నియోజకవర్గానికి రావు.. సిద్దిపేట వరకే పరిమితమవుతాయి. బస్వాపురం ప్రాజెక్ట్ పూర్తి కావస్తుంది అంటున్నారు. అది బునాదిలోనే ఉంది. అందులో కాళేశ్వరం నీళ్లు ఓ కలలా మిగులుతాయి తప్ప.. గోదావరి జలాలతో నింపడం కేసీఆర్ కు కాదు కదా ఆయన జేజమ్మ వచ్చినా సాధ్యం కాదు’’ అని పేర్కొన్నారు.