హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ రిపోర్టును సిద్ధం చేసింది. ఈ నివేదికను మంగళవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కమిటీ చైర్మన్ మల్లు రవి అందజేయనున్నారు. సురేఖ నుంచి రెండుసార్లు రాతపూర్వక వివరణ తీసుకున్నప్పటికీ, ఆమె సమాధానంపై క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదని సమాచారం. సాధారణ న్యాయ సూత్రాల ప్రకారం తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి స్పందించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోగా మౌనం వహించడం పార్టీ నిబంధనలను అతిక్రమించడమేనని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం, పార్టీపై సుస్మిత చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారడమే కాకుండా సీఎం వ్యక్తిత్వానికి భంగం కలిగిందని కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. మంత్రి సురేఖతో పాటు ఇటీవల పార్టీపై బహిరంగ విమర్శలు చేసిన సీనియర్ నేత చిన్నారెడ్డి, మరొక నాయకుడిపై కూడా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్టు ఆధారంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ హైకమాండ్‌తో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
