- సోమవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
హైదరాబాద్, వెలుగు: గంగానది పరివాహక ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌సహా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మహబూబాబాద్ కురవిలో అత్యధిక వర్షం
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ప్రకారం.. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లెలో 39.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 36.5 మి.మీ, మహబూబాబాద్ జిల్లా గంగారంలో 33.5 మి.మీ, మెదక్ జిల్లా నర్సాపూర్ లో 32.8 మి.మీ, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం (మంచుకొండ)లో 31.5 మి.మీ, కల్లూరులో 31.3 మి.మీ వర్షపాతం నమోదైంది. గార్ల, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట, సీరోలు, కొణిజర్ల, ఆలేరు, నాంగునూరు, మంథని, మహదేవ్ పూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతాల్లో 25 నుంచి 31 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది.
నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు..
మంగళవారం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
