ఎంఈవోలకే డీడీవో పవర్స్ ఇవ్వాలి : పీఎస్ హెచ్ఎంఏ

ఎంఈవోలకే డీడీవో పవర్స్ ఇవ్వాలి :  పీఎస్ హెచ్ఎంఏ

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూల్స్ టీచర్ల జీతాలు, సెలవులు, ఇతర సర్వీసు వ్యవహారాల పరిష్కారం కోసం ఎంఈఓలకే డీడీవో పవర్స్ పునరుద్ధరించాలని ప్రైమరీ స్కూల్స్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (పీఎస్​హెచ్​ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బి. మురళీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం. పద్మారావు, ఫైనాన్స్ సెక్రటరీ గాలయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్​లో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో ఎంఈవోలకు ఉన్న డీడీవో అధికారాలను ప్రస్తుతం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో పాలనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు ఒకవైపు పాఠాలు చెబుతూనే, మరోవైపు బడి నిర్వహణ, విద్యా కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారని పేర్కొన్నారు. వీటికి తోడు డీడీవో బాధ్యతలు తోడవడంతో బోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల నుంచి ఈ బాధ్యతలను వెంటనే తప్పించి, పాత పద్ధతిలోనే ఎంఈవోలకు అధికారాలిస్తేనే టీచర్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని సూచించారు.