- రాష్ట్రం గర్వించదగిన సంస్థ సింగరేణి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను బీఎస్ఎన్ఎల్ మాదిరిగా కానివ్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బొగ్గుకే పరిమితం చేయకుండా బంగారం, లిథియం మైనింగ్‌లోకి తీసుకెళ్లి లాభాల బాటలో నడిపిస్తామన్నారు. ఎన్‌టీపీసీ స్థాయిలో సింగరేణిని నిలబెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్ లో సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు డిప్యూటీ సీఎంను సన్మానించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘాల నేతలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి భేటీ అయ్యారు.
రాష్ట్రానికి ఆత్మ లాంటి అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని భట్టి ప్రకటించారు. ఐదారు సంవత్సరాల్లో సంస్థ మూతపడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులం గట్టి పట్టుదలతో నైని కోల్ బ్లాక్‌ను సాధించామని చెప్పారు. 2013లో యూపీఏ ప్రభుత్వం సింగరేణికి రీ-అసైన్ చేసిన తాడిచర్ల-2 కోల్ బ్లాక్ విషయాన్ని కేంద్రంతో మాట్లాడి మైనింగ్ లీజు దక్కించుకోవడంలో ప్రభుత్వం సఫలమైందని తెలిపారు.
బొగ్గుపైనే ఆధారపడితే సింగరేణి కూడా ఒకప్పటి బీఎస్ఎన్ఎల్ సంస్థలా వెనకబడిపోయే ప్రమాదం ఉందని భట్టి హెచ్చరించారు. అందుకే ప్రపంచ మార్పులకు అనుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి 'క్రిటికల్ మినరల్స్' (కీలక ఖనిజాలు) మైనింగ్ వైపు సింగరేణిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ వంటి దేశాల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించామని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇప్పటికే కర్నాటకలోని ఒక గోల్డ్ మైన్ వేలంలో పాల్గొని సాధించామని, ఆ గని ద్వారా భవిష్యత్ లో అక్కడ మైనింగ్ చేస్తే సింగరేణికి నిరంతరం ఆదాయం వస్తుందన్నారు.
సింగరేణికి పూర్తి సహకారం: మంత్రి ఉత్తమ్
డిప్యూటీ సీఎం భట్టి నాయకత్వంలో సింగరేణి సంస్థ కొత్త గనుల ప్రారంభం, వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టులతో శరవేగంగా ముందుకు సాగుతోందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. సింగరేణిని దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.
