హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గం మంగళవారం గాంధీభవన్‌లో భేటీ కానున్నది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీకి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షత వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కొత్తగా నియమితులైన డీసీసీ చీఫ్ లు, పాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కాగా, రాష్ట్రంలో ఒక్క మేజర్ పంచాయతీ కూడా బీఆర్ఎస్, బీజేపీ ఖాతాలో వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా పీసీసీ పావులు కదుపుతున్నది.
ముఖ్యంగా బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో ఆరుగురు ఆ పార్టీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ కసరత్తు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో డీసీసీ చీఫ్‌లకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే, కొత్తగా నియమితులైన డీసీసీ చీఫ్‌లకు నియామక పత్రాలు అందజేస్తారు. మాజీ డీసీసీ అధ్యక్షుల సేవలకు గుర్తింపుగా వారిని సన్మానించనున్నారు.
