
నిజామాబాద్, వెలుగు : గత ప్రభుత్వం చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని భరిస్తూనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. ప్రభుత్వానికి ప్రతీనెల రూ. 18 వేల కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ. 6 వేల కోట్లను ఉద్యోగుల జీతభత్యాలకు, మరో రూ. 6,500 కోట్లను వడ్డీలు, కిస్తీలకే కడుతున్నామన్నారు.
మిగిలిన ఆదాయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఇబ్బందిగా మారినా ఎక్కడా రాజీపడడం లేదన్నారు. నిజామాబాద్‌లోని బృందావన్ గార్డెన్స్‌లో శుక్రవారం ట్రస్మా నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండు విద్యాసంస్థలు నిర్వహిస్తున్న తనకు మేనేజ్‌మెంట్ల బాధలు తెలుసని.. అందుకే రూ. 600 కోట్ల ఫీజు బకాయిలు రిలీజ్ చేయించామన్నారు.
మిగతా బకాయిలను కూడా త్వరగా రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ర్యాంకుల కోసం స్టూడెంట్లను ఇబ్బంది పెట్టకుండా... భవిష్యత్ కోసం స్పోర్ట్స్‌లో కూడా రాణించేలా చూడాలన్నారు. ప్లే గ్రౌండ్లు లేని స్కూళ్లకు పర్మిషన్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా స్టూడెంట్స్‌కు, పేరెంట్స్‌కు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రైవేట్ రంగంలోని టీచర్లతో పాటు ఇతర ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వంతో మాట్లాడుతానని, ట్రస్మా యూనియన్ బిల్డింగ్‌కు హైదరాబాద్‌లో ల్యాండ్ ఇచ్చేలా చొరవ తీసుకుంటానని, ఇందూర్ జిల్లాలో 300 గజాల స్థలం ఇప్పిస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్ల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఇందూర్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ తెస్తానన్న హామీని నెరవేర్చానని చెప్పారు. టీయూలో అగ్రికల్చర్ కాలేజీ మంజూరుకు సైతం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీఈవో అశోక్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, నాయకులు నరాల రత్నాకర్, శేఖర్‌గౌడ్, వినయ్‌రెడ్డి పాల్గొన్నారు.