
- ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకు రెండో ప్రయారిటీ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నవారికే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్లో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాల పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్చార్జులు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను సమావేశంలో తెలుసుకున్నారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి కమిటీ పదవుల్లో రెండో ప్రాధాన్యం ఉంటుందన్నారు. శుక్రవారం జిల్లా అబ్జర్వర్లు, పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్లతో సమావేశం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్లో మొదటి నుంచి కొనసాగుతున్న కార్యకర్తలకే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని, తమకు హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పార్టీలో కొత్త, పాత అందరిని కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు.