భగవంత్ మాన్ వార్నింగ్​కు..ఆఫీసర్లు దిగొచ్చిన్రు!

భగవంత్ మాన్ వార్నింగ్​కు..ఆఫీసర్లు దిగొచ్చిన్రు!
  • డ్యూటీకి రావాలని పీసీఎస్ ఆఫీసర్లకు డెడ్​లైన్
  • లేదంటే సస్పెండ్​ చేస్తామని సీఎం హెచ్చరిక
  • సీఎం, అడిషనల్​సీఎస్​తో చర్చలు
  • సామూహిక సెలవుల నిరసన విరమణ

చండీగఢ్: పంజాబ్​ సివిల్ సర్వీసెస్ (పీసీఎస్) ఆఫీసర్లు తమ సామూహిక సెలవుల నిరసనను బుధవారం విరమించుకున్నారు. దీనికి ముందు వారంతా సీఎం భగవంత్​మాన్​తో పాటు అడిషనల్ చీఫ్ సెక్రటరీ వేణుప్రసాద్​తో సమావేశం అయ్యారు. త్వరలోనే పీసీఎస్ ఆఫీసర్లు డ్యూటీకి అటెండ్ అవుతారని వేణు ప్రసాద్ ప్రకటించారు. పీసీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యామని చెప్పారు. శాంతియుత వాతావరణంలో చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు.అసోసియేషన్​ ప్రెసిడెంట్ రజత్ ఒబెరాయ్ కూడా నిరసన విరమణపై హామీ ఇచ్చారని చెప్పారు. సివిల్ సర్వీసెస్ అధికారుల తీరుపై బుధవారం ఉదయం సీఎం భగవంత్ మాన్​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా అందరూ డ్యూటీలకు హాజరుకావాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే సస్పెండ్​ చేస్తానని వార్నింగ్​ ఇచ్చారు. దీంతో అసోసియేషన్​ ప్రతినిధులు చర్చలు జరిపి.. నిరసన విరమించుకున్నారు.

అసలేం జరిగిందంటే..

లూథియానాలోని రీజినల్ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసర్ నరీందర్‌‌ సింగ్‌‌ ధాలివాల్‌‌ను శుక్రవారం స్టేట్‌‌ విజిలెన్స్‌‌ బ్యూరో అధికారులు అరెస్ట్​ చేశారు. రూల్స్ బ్రేక్​ చేసిన వాహనదారులపై ఫైన్లు వేయ కుండా వారి నుంచి లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలతో నరీందర్​సింగ్​ను అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సర్వీసెస్ అధికారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పీసీఎస్ అధికారులంతా సోమవారం నుంచి ఐదు రోజుల పాటు సామూహిక సెలవులపై వెళ్లిపోయారు. దీంతో ఆఫీసుల్లో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై సీఎం భగవంత్​మాన్​ తీవ్రంగా స్పందించారు. రెండు రోజులు చూసిన ఆయన, బుధవారం అల్టిమేటం జారీ చేశారు. ‘‘కొందరు పీసీఎస్ ఆఫీసర్లు సమ్మె పేరుతో డ్యూటీకి రావడం లేదని నా దృష్టికి వచ్చింది. అవినీతిపరుడైన అధికారికి సపోర్ట్​ చేస్తూ నిరసన చేస్తున్నారు. ఇది బ్లాక్​మెయిలింగ్ అవుతుంది. క్లియర్​గా చెప్పాలంటే.. ఎవరు అవినీతికి పాల్పడినా సహించం. సెలవుల నిరసనను ఇల్లీగల్​గానే పరిగణిస్తున్నాం. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా అందరూ డ్యూటీకి రావాలి. రానివాళ్లందరినీ సస్పెండ్ చేస్తాం”అని భగవంత్ మాన్ హెచ్చరించారు. ఈ మేరకు అడిషనల్ సీఎస్​కు లెటర్ కూడా రాశారు. చివరికి సీఎం కార్యదర్శితో అధికారులు చర్చలు జరిపి సమ్మెను విరమించుకున్నారు.