
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయడం సబబేనంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. పీడీ యాక్ట్ రద్దు చేయాలంటూ ఆయన భార్య ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ శ్రీదేవితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.
హత్య కేసు సహా మొత్తం వంద కేసులు ఆయనపై ఉన్నాయని, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికీ రౌడీషీట్ ఉందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇది కేవలం కక్ష సాధింపేనని రాజాసింగ్ తరఫు అడ్వకేట్ ఎల్ రవి చందర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ నిబంధనలను పోలీసులు ఎక్కడా పాటించలేదని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న డివిజన్ బెంచ్, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.