జయశంకర్ భూపాలపల్లి/ పాల్వంచ/నల్లబెల్లి: వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. శుక్రవారం ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో సీసీఏస్ సీఐ రమేశ్ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ రాజేశ్తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ ఎరువుల విక్రయాల నివారణపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసర్బాబురావు తనిఖీ చేశారు.
స్టాక్ రికార్డుల్లో తేడాలను గుర్తించి, వివరాలు ఆరా తీశారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా స్టాక్ దిగుమతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురంలో విజయదుర్గ పురుగు మందుల దుకాణంలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ ఆఫీసర్లు దాడులు చేశారు. రూ.2.34 లక్షల విలువైన గడువు ముగిసిన మందులను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. షాపు వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్నకుమార్ తెలిపారు.
