ముఫ్తీ కారుకు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన మహిళా నేత

ముఫ్తీ కారుకు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన మహిళా నేత

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జనవరి 11న మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తృటిలో తప్పించుకున్నారు. పలు నివేదికల ప్రకారం, ఈ సంఘటన జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగింది. ప్రమాదం తాకిడికి నల్లటి స్కార్పియో బానెట్ మెలికలు తిరిగింది. ఈ రోజు అనంత్‌నాగ్‌లో ముఫ్తీ కారు ఘోర ప్రమాదానికి గురైందని, దేవుడి దయ వల్ల ఆమె, ఆమె భద్రతా అధికారులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని పీడీపీ నేత కుమార్తె ఇల్తిజా Xలో చెప్పారు.

ఈ సందర్భంగా స్పందించిన మాజీ జమ్ము కశ్మీర్ మంత్రి ఒమర్ అబ్దుల్లా.. మెహబూబా ముఫ్తీ సాహిబా ప్రమాదం జరిగిన ఘటనలో గాయాల నుండి తప్పించుకున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. ప్రమాద పరిస్థితులను ప్రభుత్వం విచారిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.

సంగం వద్ద మఫ్తీ వాహనం.. ఓ కారును ఢీకొట్టిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు ఖానాబాల్‌కు వెళ్లిన పీడీపీ చీఫ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే, ఆమె వ్యక్తిగత భద్రతలో ఉన్న ఒక పోలీసు అధికారికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.