విద్యను మాఫియాకు కట్టబెట్టిండు

విద్యను మాఫియాకు కట్టబెట్టిండు
  • విద్యారంగాన్ని బలిపీఠం ఎక్కించిన సీఎం కేసీఆర్
  • పీడీఎస్​యూ రౌండ్ టేబుల్ మీటింగ్​లో వక్తలు

ముషీరాబాద్, వెలుగు : తెలంగాణలో ల్యాండ్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలతో పాటు విద్య మాఫియా కూడా పెరిగిపోయిందని వక్తలు ఆరోపించారు. కేసీఆర్ తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రైవేట్ వర్సిటీలను కట్టబెట్టి  విద్య మాఫియాకు పాల్పడటం చాలా దారుణమని మండిపడ్డారు. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా సంస్థలను రానివ్వొద్దనే ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్​యూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. 

చీఫ్​గెస్టుగా రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి హాజరై మాట్లాడారు. పాలకులే విద్యా వ్యాపారులుగా మారడంతో తెలంగాణలో విద్యారంగం బలిపీఠంపైకి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేజీ టు పీజీ ఉచిత విద్య, కామన్ విద్యా విధానమే నా కల’ అన్న కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్ర విద్యారంగాన్ని సమీక్షించకపోవడం ఆయన పాలనకు నిదర్శనమన్నారు. 

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసం ఆలోచించకుండా విద్యారంగాన్ని పరిరక్షించకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో  పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, దిడ్డి సుధాకర్, కె. రమా, ఎం అన్వేష్, మధుసూదన్ రెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.