ప్రశాంతంగా హిందూ సంఘాల ర్యాలీ

ప్రశాంతంగా హిందూ సంఘాల ర్యాలీ

సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభు మందిరం దగ్గర ఉన్న హనుమాన్​ ఆలయంలో ఈ నెల 15న వినాయక విగ్రహం ధ్వంసం చేసినందుకు నిరసనగా శనివారం హిందూ సంఘాలు బందుకు పిలుపునిచ్చాయి. పట్టణంలో వీహెచ్​పీ, బీజేపీ, హిందు సంఘాల నాయకులు, యువకులు నిరసన ర్యాలీ చేపట్టారు. మత విద్వేశాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో సీసీ కెమెరాల పరిశీలించగా మందిరం దగ్గర ఆవులు కనిపించాయన్నారు. వాటిని ట్రాక్​ చేయగా పట్టణంలోని కబ్రస్తాన్​దగ్గర ఓ పశువు ముఖానికి ఇరువైపులా చందనం ఉన్నట్లు తేలిందన్నారు. గర్భగుడిలో ఉన్న పండ్లు, పూలు తినడానికి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 

ఆలయాలపై దాడులు నిరోధించాలి

సంగారెడ్డి టౌన్: హిందూ ఆలయాలలో విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బజరంగ్​దళ్​రాష్ట్ర నాయకుడు సుభాష్ చందర్ మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని, విచారణ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని, ఆలయాల వద్ద పోలీసు పికెటింగ్​ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీహెచ్​పీ, బీజేపీ నాయకులు ప్రభు కుమార్ గౌడ్, మనోజ్, మాణిక్యరావు, నాగరాజ్, రవి, మహిళలు పాల్గొన్నారు.