- కారులో వెళ్లిన ముగ్గురు దుండగులు ..బెదిరించి నగలు, నగదుతో పరార్
సుల్తానాబాద్, వెలుగు: పోలీసులమని బెదిరించి చోరీకి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. బంగారం, నగదుతో దుండగులు పారిపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన సంకరి రమేశ్కరీంనగర్ లోని ఓ ఫర్టిలైజర్ షాప్ లో పని చేస్తున్నాడు.
అతని భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో రమేశ్ తో పాటు అతని తల్లి లక్ష్మి, నానమ్మ ఐలమ్మ ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంటి ముందుగా ఆపారు. ఇంట్లోకి వెళ్లి రమేశ్అని పిలవగా లేచి తలుపులు తీశాడు. ముగ్గురిలో ఒకరు పోలీస్ డ్రెస్ లో ఉండగా.. మిగతా ఇద్దరు రమేశ్ పై నేరారోపణలు మోపి బెదిరించారు.
ఆపై అతని చేతులకు బేడీలు వేసి కాళ్లపై కూర్చొబెట్టారు. దీంతో రమేశ్ తల్లి, నానమ్మ భయాందోళనకు గురయ్యారు. వారితో ఇంట్లోని బీరువాను తెరిపించి అందులోని 6 తులాల బంగారం, రూ.10 వేల నగదును తీసుకుని కారులో పారిపోయారు. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ క్లూస్ టీమ్ తో వెళ్లి విచారణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
