వీడిన పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే సోద‌రి కుటుంబం డెత్ కేసు మిస్ట‌రీ

వీడిన పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే సోద‌రి కుటుంబం డెత్ కేసు మిస్ట‌రీ

వారంతా ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌న్న సీపీ క‌మ‌ల్ హాస‌న్ రెడ్డి

కరీంనగర్: ఈ ఏడాది జనవరి 27న తిమ్మాపూర్ మండలం ఆలూరు పెద్ద ఎస్ఆర్ఎస్పి కాలువలో పడి చనిపోయిన సత్యనారాయణ రెడ్డి కుటుంబం(పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి ఫ్యామిలీ) మృతిని పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. సత్యనారాయణ రెడ్డి నిర్వహించే షాప్ లో దొరికిన లెటర్ ఆధారంగా వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చినట్టు సీపీ కమల్ హాసన్ రెడ్డి ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. లెటర్ లోని హ్యాండ్ రైటింగ్, ఇతర పుస్తకాల్లో రాసిన హ్యాండ్ రైటింగ్ ఒకటేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిన‌ట్టు సీపీ స్ప‌ష్టం చేశారు.

రామ‌డుగు మండ‌లం ల‌క్ష్మీపురం గ్రామానికి చెందిన స‌త్య‌నారాయ‌ణ రెడ్డి క‌రీంన‌గ‌ర్ లోని బ్యాంక్ కాల‌నీలో నివాస‌ముండేవారు. ఒక ఫెర్టిలైజ‌ర్ షాప్ నిర్వ‌హించ‌డంతో‌ పాటుగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. త‌ర‌చూ విహార‌యాత్ర‌ల‌కు వెళ్లే అల‌వాటున్న ఆ కుటుంబం జ‌న‌వ‌రి 27న కూడా భార్య రాధ, కూతురు వినయ్ శ్రీ తో కలిసి సత్యనారాయణ రెడ్డి కారులో వెళ్లారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేక‌పోవ‌డంతో బంధువులంతా కూడా విహార‌యాత్ర‌కే వెళ్లింద‌నుకున్నారు.

కానీ ఫిబ్ర‌వ‌రి 17 ఆదివారం రోజున మానేరు కాలువలో స‌త్య‌నారాయ‌ణ రెడ్డి కారు క‌నిపించింది. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఆ కారును ప‌రిశీలించ‌గా అందులో సత్యనారాయణ రెడ్డి , అత‌ని భార్య రాధ, కూతురు వినయ్ శ్రీ శ‌వాలు కుళ్లిన స్థితిలో బయటపడ్డాయి. ఆధారాలను బ‌ట్టి ఆ కుటుంబం పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలడంతో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

విచార‌ణ‌లో భాగంగా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి నిర్వ‌హిస్తున్న ఫెర్టిలైజ‌ర్ షాప్ లో పోలీసుల‌కు ఓ సూసైడ్ నోట్ ల‌భించింది. పోలీసులు ఆ నోట్‌ను , స‌త్యనారాయ‌ణ రెడ్డి గ‌తంలో రాసిన వివిధ పుస్త‌కాల‌ను ప‌రిశీలించి వాటిని ఫోరెన్సిక్ టెస్ట్‌కు పంపారు. లెటర్ లోని హ్యాండ్ రైటింగ్, ఇతర పుస్తకాల్లో రాసిన హ్యాండ్ రైటింగ్ ఒకటేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలడంతో స‌త్య‌నారాయ‌ణ రెడ్డి కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు పోలీసులు ధృవీక‌రించారు.