అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుస్తుంది.. స్పాట్లో దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డర్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుస్తుంది.. స్పాట్లో దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డర్

అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ను అధికారులు గుర్తించారు. ఈ డివైజ్లో రికార్డ్ అయిన వాయిస్ రికార్డ్లో ఏముందో తెలిస్తే.. విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయంలో స్పష్టత  వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యాక్సిడెంట్ స్పాట్లో ఫ్లైట్ డేటా రికార్డర్(FDR) ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారులకు లభ్యమైన సంగతి తెలిసిందే.

విమాన ప్రమాదాలు జరిగిన సమయంలో కీలకంగా మారే బ్లాక్ బాక్స్ కూడా ఇప్పటికే లభ్యమైంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు ‘మేడే’ కాల్  ఎందుకు చేశారో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్సులు సహకరిస్తాయి. ప్రమాదానికి గురైన విమాన బ్లాక్ బ్లాక్సులు దొరికితే వాటిని ఫోరెన్సిక్  ల్యాబరేటరీస్ లేదా ఎయిర్ క్రాఫ్ట్  యాక్సిడెంట్  ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు పంపుతారు. అక్కడ నిపుణులు ఆ బ్లాక్ బాక్స్ లోని డేటాను రికవరీ చేసి డీకోడ్  చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొద్ది రోజులు లేదా వారాలు పట్టవచ్చు.

ఒక విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలు, సంఘటనల గురించి సెకండ్ టు సెకండ్  ఇన్ఫర్మేషన్ ను బ్లాక్ బాక్సులు రికార్డు చేస్తాయి. సాధారణంగా ప్రతి కమర్షియల్  ఫ్లైట్ లో రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఆరెంజ్  కలర్ లో ఉండే ఇవి క్రాష్  రెసిస్టెంట్లు. అంటే విమానం ఎలాంటి ప్రమాదానికి గురైనా బ్లాక్ బాక్సులు మాత్రం చెక్కు చెదరవు. ఆవిధంగా వాటిని తయారు చేస్తారు. పేలుడు, అగ్నిప్రమాదం, వాటర్  ప్రెజర్, హైస్పీడ్  క్రాషెస్  వంటి వాటిని ఇవి తట్టుకుంటాయి. తాజాగా ప్రమాదానికి గురైన బోయింగ్ 787 వంటి ఆధునిక విమానాల బ్లాక్ బాక్సుల్లో ప్రతి సమాచారం రికార్డవుతుంది.

కాక్ పిట్ కమాండ్  ఇన్ పుట్స్  నుంచి ఎయిర్ కండిషనింగ్  సిస్టమ్స్ వరకు వీటిలో డేటా నమోదవుతుంది. కాక్ పిట్  ఆడియో పైలట్  సంభాషణ, రేడియో ట్రాన్స్ మిషన్స్, వార్నింగ్  అలార్మ్  వంటి సమాచారాన్ని కాక్ పిట్  వీడియో రికార్డర్  (సీవీఆర్) క్యాప్చర్  చేస్తుంది. విమానం ప్రమాదానికి గురవడానికి చివరి క్షణాల డేటా అంతా బ్లాక్ బాక్స్ లోనే రికార్డు అవడంతో దర్యాప్తులో ఈ డేటానే కీలకం అవుతుంది. 25 గంటల సమాచారాన్ని సీవీఆర్ లు స్టోర్  చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మేజర్  ఫ్లైట్ క్రాష్ కు గల కారణాలను తెలుసుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి.