
తెలంగాణకు ఎరువుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం తో చర్చలు జరిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రామగుండం ఫర్టిలైజర్ సంస్థ పనితీరు, తెలంగాణకు రావలసిన యూరియా కోటా పై మంగళవారం (జులై 15) కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ మిశ్రాను న్యూఢిల్లీలో కలిశారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లో ఏర్పడుతున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రామగుండం కార్పొరేషన్ లో అనుకున్న ఉత్పత్తి స్థాయికి చేరుకోలేకపోవడం వల్ల, తెలంగాణకు సరైన ఎరువుల కేటాయింపు జరగడం లేదని మిశ్రాకు తెలిపారు. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రజత్ మిశ్రాను కోరారు.
ఎంపీ విన్నపాన్ని సానుకూలంగా స్వీకరించారు రాజత్ మిశ్రా . గత వ్యవసాయ సీజన్‌లో జరిగిన లోటును ఈ సీజన్‌లో పూర్తిగా భర్తీ చేస్తామన్న హామీ ఇచ్చారు. మొత్తం 2.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఈ సీజన్‌లో తెలంగాణ రైతులకు సరఫరా చేయబడతాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. తెలంగాణ హక్కు కోసం కేంద్రంలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ఎరువుల కొరత వల్ల ఒక్క రైతు కూడా నష్టపోవద్దనే లక్ష్యంతో పని చేస్తానని తెలిపారు. అందుకోసం అవసరమైన అన్ని స్థాయిల్లో కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రైతు బాగు కోసం – ప్రతి బస్తా ఎరువుకూ మా పోరాటం! అని లేఖలో పేర్కొన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.