
- గోదావరిఖని వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి వెల్లడి
గోదావరిఖని, వెలుగు: డబ్బులు ఇవ్వాలని వ్యాపారులను బెదిరించిన కేసులో నిందితుడిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్మండలం ఇందారం గ్రామానికి చెందిన యాదనవేని తిరుపతి ఐదేండ్ల కింద బతుకు దెరువు కోసం గోదావరిఖని వెళ్లి చంద్రశేఖర్‌నగర్‌లో ఉంటూ హమాలీగా చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశాడు.
ఈనెల18న రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్యలో టౌన్ లోని లక్ష్మినగర్, కళ్యాణ్‌నగర్‌కు చెందిన ఇద్దరు కిరాణా వ్యాపారులకు ఫోన్ చేశాడు. రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని, లేదంటే కుటుంబ సభ్యులకు హాని చేస్తానని బెదిరించాడు. గతంలో గోదావరిఖని చౌరస్తాలో మర్డర్ చేశానని, రౌడీ షీటర్అని చెప్పి భయపెట్టాడు. దీంతో ఆందోళన చెందిన వ్యాపారులు ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా తిరుపతిగా గుర్తించి మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామని సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.