నష్టపరిహారం ఇచ్చే వరకు పనులు జరగనివ్వం

నష్టపరిహారం ఇచ్చే వరకు పనులు జరగనివ్వం

వెనుదిరిగి వెళ్లిన అధికారులు

జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు : ట్రిపుల్​ఆర్​( రీజినల్ రింగ్ రోడ్డు) కోసం బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లిలో ఆఫీసర్లు నిర్వహిస్తున్న సర్వేను రైతులు అడ్డుకున్నారు. 1974లో అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం గ్రామంలోని దళితుల కోసం సర్వే నంబర్​191/1లో 250 ఎకరాల అసైన్డ్​భూమిని, పట్టాలను150 మంది రైతులకు ఇచ్చారు. అయితే వీరి భూముల్లోంచి 19 ఎకరాలను కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కోసం, మరో 25 ఎకరాలను రోడ్డు వెడల్పు పనుల కోసం టీఆర్ఎస్​సర్కారు తీసుకున్నా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మిగిలిన 190 ఎకరాలను పార్ట్​ బీలో చేర్చారు.

దీంతో రైతులకు రైతుబంధు, రైతు బీమా రావడం లేదు. మళ్లీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం అధికారులు భూ సర్వేకు రాగా రైతులు అడ్డుకున్నారు. ఇప్పటికే 44 ఎకరాలను కోల్పోయామని, మిగిలిన భూములు కావాలంటే  ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, తర్వాతే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్​చేశారు. లేకపోతే భూసేకరణ‌ జరగనివ్వమని తేల్చి చెప్పారు. బలవంతంగా భూసేకరణ చేయాలని చూస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో  వెళ్లిపోయారు.