- డిప్యూటీ సీఎం చౌనా మెయిన్, 10 మంది మంత్రులు కూడా..
- 36 ఏండ్ల తర్వాత మంత్రివర్గంలో మహిళకు అవకాశం
- కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు హాజరు
గౌహతి/ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా చౌనా మెయిన్ సహా మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 36 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో దసంగ్లు పుల్ అనే మహిళకు మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే దసంగ్లు పుల్ అరుణాచల్ మాజీ సీఎం కలిఖో పుల్ భార్య. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోమంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. గురువారం ఇటానగర్‌లోని దోర్జీ ఖండూ కన్వెన్షన్ హాల్లో సీఎం, మంత్రివర్గం చేత రాష్ట్ర గవర్నర్ కేటీ పర్నాయక్ ప్రమాణం చేయించారు. 60 ఎమ్మెల్యే సీట్లు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాలు గెలుచుకొని వరుసగా మూడవ సారి అధికారంలోకి వచ్చింది. బుధవారం ఇటానగర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా పెమా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్రంలో రెండో మహిళా మంత్రి దసంగ్లు పుల్
36 ఏండ్ల తర్వాత అరుణాచల్‌లో దసంగ్లు పుల్ మహిళా మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఈమె రెండో మహిళా మంత్రి కావడం గమనార్హం. రాష్ట్రంలో మొట్టమొదట 1988లో కోమోలి మోసాంగ్ డిప్యూటీ మంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించారు. ఆమె 1990లో క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుత మంత్రి దసంగ్లు పుల్ మాజీ సీఎం కలిఖో పుల్ భార్య. 46 ఏండ్ల దసంగ్లు ఇంటర్ వరకు చదివారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాష్ట్రంలోని మహిళలంతా సంతోషంగా ఉన్నారు. మంత్రివర్గంలో బీజేపీ ఒక మహిళను మంత్రిగా నియమించింది. రాష్ట్ర మహిళల తరఫున బీజేపీ ప్రభుత్వానికి, సీఎం ఖండూకు ధన్యవాదాలు” అని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం బీజేపీ మొదటి నుంచి కృషి చేస్తున్నదని ఆమె తెలిపారు.