అక్రమ కేసులు ఎత్తేసేదాకా ఆందోళన ఆపం

అక్రమ కేసులు ఎత్తేసేదాకా ఆందోళన ఆపం
  • రాతపూర్వక హామీ కోసం పట్టుబట్టిన ఎంప్లాయీస్

మంచిర్యాల, వెలుగు: చెన్నూర్​లో విద్యుత్​ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని, సిబ్బందిపై దాడి చేసిన టీఆర్ఎస్​ కౌన్సిలర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్​ యూనియన్​ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గురువారం నుంచి మంచిర్యాల జిల్లావ్యాప్తంగా పెన్​డౌన్, టూల్​డౌన్​ చేపడతామని ప్రకటించినప్పటికీ.. శుక్రవారం ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండడంతో టూల్​డౌన్​ను రెండ్రోజులు వాయిదా వేశారు. గురువారం జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 300 మందికిపైగా ఎంప్లాయీస్​ ఎస్ఈ ఆఫీసుకు తరలివచ్చి పెన్​డౌన్, రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ లీడర్లు మాట్లాడుతూ.. విద్యుత్​ సిబ్బందిపై పెట్టిన తప్పుడు అట్రాసిటీ కేసుతో పాటు ఇతర కేసులను ఎత్తేయాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగులపై దాడి చేసిన మున్సిపల్​కౌన్సిలర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, చెన్నూర్​ సబ్​స్టేషన్​ స్థలాన్ని ఎన్​పీడీసీఎల్ యాజమాన్యం కాపాడాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. 
కలెక్టర్, పోలీస్​ కమిషనర్​ను కలిసిన సీవీఓ
విద్యుత్​ఉద్యోగుల ఆందోళనపై ఎన్​పీడీసీఎల్​చీఫ్​విజిలెన్స్​ఆఫీసర్(సీవీఓ) శర్మ స్పందించారు. ఎస్ఈ రమేష్​బాబు తదితరులతో కలిసి రామగుండం పోలీస్​ కమిషనర్​ చంద్రశేఖర్​రెడ్డి, మంచిర్యాల కలెక్టర్​ భారతి హొళికేరిని కలిశారు. విద్యుత్​ సిబ్బందిపై పెట్టిన తప్పుడు కేసుల గురించి వారి దృష్టికి తీసుకెళ్లి, కేసులు ఎత్తేయాలని కోరారు. అట్రాసిటీ కేసుపై మూడు రోజుల్లోగా జైపూర్​ ఏసీపీతో ఎంక్వైరీ జరిపించి ఫాల్స్​గా తేలితే ఎత్తేస్తామని సీపీ చంద్రశేఖర్​రెడ్డి హామీనిచ్చినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన జేఏసీ లీడర్లతో చెప్పగా, తమ డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇచ్చేంతవరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. 

చెన్నూర్​ అంటేనే భయపడుతున్నరు 
కౌన్సిలర్ల చేతిలో దాడికి గురైన సిబ్బంది అక్కడ పని చేయడానికి భయపడుతున్నారు. వారిని ట్రాన్స్​ఫర్​చేసి ఇతరులను నియమించాలని యూనియన్​లీడర్లు సీవీఓ శర్మను కోరినట్టు తెలిసింది. దీంతో తామెక్కడ చెన్నూర్​కు వెళ్లాల్సి వస్తుందోనని మిగతావారు మదనపడుతున్నారు. ఉద్యోగులతో లీడర్లు వ్యవహరిస్తున్న తీరుతో చెన్నూర్​ అంటేనే 
వణికిపోతున్నారు.