పెండింగ్ సమస్యలు పరిష్కరించాలే.. టీఎన్జీవో ఉద్యోగుల డిమాండ్

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలే.. టీఎన్జీవో ఉద్యోగుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల వేతన సవరణకు ప్రభుత్వంవెంటనే పీఆర్సీని ఏర్పాటు చేయాలని  టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్  డిమాండ్ చేశారు. ఈ ఏడాది జులై 1 నుంచి అమలయ్యేలా పీఆర్సీని ఏర్పాటు చేయాలని, గత పీఆర్సీ గడువు ముగిసినందున మధ్యంతర భృతి ( ఐఆర్ ) ఇవ్వాలని వారు కోరారు. బుధవారం నాంపల్లిలో  టీఎన్జీవో రాష్ట్ర ఈసీ మీటింగ్ జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుందని రాజేందర్, జగదీశ్వర్ తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న 17 సమస్యలపై తీర్మానాలు చేశారు.   

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు  

పంచాయతీ రాజ్ శాఖలో గత 13 ఏండ్లుగా పనిచేస్తున్న తమకు పే స్కేల్, కనీస వేతనాలు ఇవ్వాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు (డీపీఎంలు), ఈ–పంచాయతీ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. ​హిమాయత్ నగర్ లోని పంచాయతీ రాజ్ కమిషనరేట్ ముందు వారు ఆందోళన చేపట్టారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ రామారావుకు వినతిపత్రం అందజేశారు.