
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లోగా మళ్లీ పాత పెన్షన్(ఓపీఎస్) విధానాన్ని అమలు చేయకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్& వర్కర్స్ (సీసీజీఈడబ్ల్యూ), ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎఐఎస్ జీఈఎఫ్), స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ జిపిఎఫ్) ఆధ్వర్యంలో ‘చేతావనీ ర్యాలీ’నిర్వహించారు.
ఈ నిరసన ప్రోగ్రాములో తెలంగాణ, ఏపీ తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జనరల్ సెక్రటరీ తపన్ సేన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెన్షన్ ప్రైవేటీకరణకు మూలకారణమైన మోదీ ప్రభుత్వాన్ని ఓడించటమే కర్తవ్యమని అన్నారు.
పీఎఫ్ఆర్డీఏను రద్దు చేయాలని ఏఐఎస్జీఈఎఫ్ నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీకుమార్ డిమాండ్ చేశారు. అలాగే.. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలని, దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ... జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి, రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైన లౌకిక ప్రజాస్వామిక విద్యావిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.