కొత్తోళ్లకు పింఛన్లు లేట్‌‌‌‌

కొత్తోళ్లకు పింఛన్లు లేట్‌‌‌‌

కొత్త వాళ్లకు ఆసరా పెన్షన్లు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రమంతా కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా హైదరాబాద్ లో మాత్రం కాలేదు. దీంతో  అన్ని జిల్లాల్లోనూ కొత్త వారికి పెన్షన్లు మరో నెల ఆలస్యం కానున్నాయి. వచ్చే నెల నుంచి  పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పెరిగిన ఆసరా పెన్షన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కానీ డిసెంబర్ నుంచి మే వరకు వరుసగా ఎన్నికలు, కోడ్ ఉండటంతో ఎంపిక  ఆలస్యమయింది. జూన్ లో పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా కొత్త వాళ్ల ఎంపిక పూర్తవలేదు. దీంతో పాతవారికే పెరిగిన పెన్షన్​ ఇచ్చారు.

హైదరాబాద్ ​లిస్ట్​ ఎప్పుడో?

గత నెలలో పెన్షన్లపై సీఎం రివ్యూ చేసినపుడు ఆగస్టు నుంచి కొత్త వాళ్లకూ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జులై 25 కల్లా కొత్త లబ్ధిదారుల పక్రియ పూర్తి చేయాలని జోనల్ కమిషనర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. అయినా పక్రియ పూర్తి కాలేదు. అన్ని జిల్లాల్లో లబ్ధిదారులను కలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక్కడ మాత్రం హైదరాబాద్ కలెక్టరేట్, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఆలస్యమయినట్లు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇతర జిల్లాల కంటే హైదరాబాద్​లోనే లబ్ధిదారులు తక్కువగా ఉంటారని చెబుతున్నారు. ఇక్కడ కొత్త వారు లక్షలోపే ఉండొచ్చని అంటున్నారు. ఈ నెలలోనైనా పూర్తవుతుందా.. లేదా? మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

కొత్త లబ్ధిదారులు7 లక్షల మంది?

గతంలో 62 ఏళ్ల నిండిన వాళ్లకు ఆసరా పెన్షన్ ఇస్తుండగా, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు. దీంతో ఇప్పటివరకు 39 లక్షల మందికి పెన్షన్ అందుతుండగా వయసు తగ్గించటంతో మరో 7 లక్షల మంది కొత్తగా పెన్షన్ అందుకోనున్నారు. కొత్త లబ్ధిదారులు అన్ని జిల్లాల్లో కలిపి 6 లక్షల 20 వేల మంది ఉన్నట్లు సెర్ప్​ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో 70 వేల మంది ఉండొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం పెన్షన్లు పెంచడంతో  ఏటా రూ. 5,500 కోట్లు అవుతున్న ఖర్చు రూ. 10 వేల కోట్లు దాటొచ్చని అధికారులు చెబుతున్నారు.