పింఛన్లు.. పెంచుతం ఎంత పెంచేది త్వరలోనే ప్రకటిస్తం: కేసీఆర్

పింఛన్లు.. పెంచుతం ఎంత పెంచేది త్వరలోనే ప్రకటిస్తం: కేసీఆర్
  • కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులు, ఆత్మహత్యలే
  • ధరణితోనే రైతుబంధు, బీమా, వడ్ల పైసలు రైతుల ఖాతాల్లో జమ అయితున్నయ్
  • వీఆర్ఏ నుంచి మంత్రుల దాకా ఉన్న పెత్తనాన్ని ఒక్కవేటుతో రద్దు చేసినం
  • ప్రభుత్వ అధికారాన్ని రైతులకు ధారాదత్తం చేసినం
  • రాష్ట్రంలో 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్సే ఉండాలె
  • ఎక్కడ చూసినా కాళేశ్వరం నీళ్లు కనిపిస్తుంటే ఇంకా చూపిచ్చుడేంది?
  • 450 కిలోమీటర్లు ప్రవహించి సూర్యాపేట వద్ద రావిచెరువు నింపుతున్నయ్
  • ఈసారి ఐదారు సీట్లు ఎక్కువ గెలుస్తం.. సూర్యాపేట జిల్లా ప్రగతి నివేదన సభలో సీఎం

నల్గొండ, వెలుగు: 
రాష్ట్రంలో ఆసరా పింఛన్ పైసలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో రూ.200 పింఛన్ మాత్రమే ఇచ్చారని, కానీ తెలంగాణలో రూ.2 వేలు ఇస్తున్నామని చెప్పారు. ‘‘తెలంగాణలో ఒక్క చాన్స్ ఇస్తే పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్​ వాళ్లు చెప్తున్నరు. వాళ్లు 4 వేలు ఇస్తామంటే.. నేను 5 వేలు ఇస్తానని అనలేనా? కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్ రాష్ట్రాల్లో 4 వేల పింఛన్ ఎందుకు అమలుకావడం లేదు? బాధ్యతతో బ్రహ్మాండంగా పాలన చేయాలి. మనం కూడా పింఛన్ పెంచుదాం. ఎంత పెంచుతమనేది త్వరలోనే ప్రకటిస్తం’’ అని చెప్పారు. ఆదివారం సూర్యాపేటలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మెడికల్ కాలేజీ భవనాలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్కార్‌‌‌‌ను నడిపించడం, సంసారాన్ని నడిపించడం ఒక్కటేనని అన్నారు.


రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి వస్తే మళ్లీ ఆకలి చావులు, ఆత్మహత్యలేనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తొలగిస్తామని చెప్తున్నారని, కానీ ధరణి తొలగించి ఏం చేస్తారనేది మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు. ధరణి వల్ల రైతుబంధు, రైతు బీమా, వడ్ల పైసలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, భూముల రిజిస్ట్రేషన్లతో సహా అన్ని రకాల పనులు చకచకా జరిగిపోతున్నాయని చెప్పారు. ‘‘వీఆర్ఓ వ్యవస్థ రద్దు వల్ల రైతులకు మేలు జరిగింది. వీఆర్‌‌‌‌వోలు రాక్షసుల్లాగా రైతులను రాచి రంపాన పెట్టారు. ఎల్లయ్య, మల్లయ్య పేర్ల మీదున్న భూములను ఉల్టా పట్టా రాసి ఆగమాగం చేశారు. వీఆర్ఏ, గిర్దావర్, తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రుల పెత్తనాన్ని ధరణి అనే ఒక్కవేటుతో రద్దు చేసినం. రెవెన్యూలో పాతుకుపోయిన పెత్తందారీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించినం. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని రైతులకు ధారాదత్తం చేసినం. ఒకప్పుడు రైతు చనిపోతే ఆపద్బంధు కింద ఇచ్చే రూ.50 వేల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినం. కానీ ధరణి వచ్చాక అవేమీ లేకుండానే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతున్నయ్. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులే తిరిగి వస్తయ్. రైతులకు ఇచ్చిన అధికారం మళ్లీ దూరమైపోతది’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ వద్దని, మూడు నాలుగు గంటలు చాలని అంటున్నారు. మోదీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెడ్తామని చెప్తోంది. ఈ రెండు పార్టీల వల్ల రైతులు నట్టేట మునిగిపోయే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.

ఎక్కడ చూసినా నీళ్లే.. ఇంకేం చూపించాలె?

గతంలో కంటే ఈసారి ఐదారు సీట్లు ఎక్కువనే గెలుస్తమని కేసీఆర్​ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు.. ‘‘మొన్న భట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కాళేశ్వరం నీళ్లు ఎక్కడున్నాయో చూపెట్టమని అడిగారు. నీ బొంద? ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తుంటే ఇంకా చూపించడం ఏంటి? 450 కిలోమీటర్ల దూరం నుంచి కాళేశ్వరం నీళ్లు ప్రవహించి వచ్చి సూర్యాపేట వద్ద రావిచెరువును నింపుతున్నయ్” అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని, మళ్లీ వాళ్లకు అధికారం కట్టబెడితే సూర్యాపేటలో మూసీ మురికి నీరు పారడం, దంతాపల్లి రోడ్డుపైన మళ్లీ దంతాలు విరగడం ఖాయమని సెటైర్లు వేశారు.

సూర్యాపేట జిల్లాకు వరాలు

సూర్యాపేట జిల్లాకు వరాలు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్​చెప్పారు. జిల్లాలోని 575 పంచాయతీలకు ఒక్కో దానికి రూ.10 లక్షలు, కోదాడ, హుజూర్​నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, సూర్యాపేటకు ప్రత్యేకంగా రూ.50 కోట్లు సీఎం ప్రత్యేక నిధుల నుంచి శాంక్షన్ చేస్తామని ప్రకటించారు. మంత్రి జగదీశ్‌‌రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేటకు అదనంగా ఆర్అండ్​బీ గెస్ట్​హౌస్‌‌, స్పోర్ట్స్ స్కూల్, రూ.25 కోట్లతో భానుపురి కళాభారతి ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్ శాంక్షన్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. 

రిలాక్స్ కావొద్దు.. అద్భుతాలు సాధించాలి

కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మానవ అభివృద్ధి సూచికలో, సంపద పెరుగుదలలో రాష్ట్రం ఉండడం గర్వంగా, సంతోషంగా ఉందని చెప్పారు.  ప్రగతి కాముకులు, పనిమంతులు, ఎప్పుడూ రిలాక్స్ కావొద్దని, ఇంకా చాలా అద్భుతాలు సాధించాల్సి ఉందని అన్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సీఎస్​ శాంతికుమారి పాల్గొన్నారు.