
ప్రస్తుతం ప్రపంచంలో కనిపించని అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఆఫ్రికా ఖండం నెమ్మదిగా ఆసియా నుంచి క్రమంగా దూరం అవుతోంది. సంవత్సరానికి ఒక అంగుళం చొప్పున.. వేల సంవత్సరాలలో ఆఫ్రికా ఆసియాతో భౌగోళికంగా అనుసంధానం కాదు. ఈ అతిపెద్ద మార్పు జరిగినప్పుడు మనం దానిని ఎప్పటికీ గ్రహించలేం. అదే విధంగా భారతదేశపు రాజకీయాల్లోనూ అతి పెద్ద కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇవి భారత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ రాజకీయ మార్పులు ప్రజల జీవితాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను కీలక మార్పులకు గురిచేస్తాయి. ఈ పరిణామం మొత్తం దేశాన్ని ప్రభావితం చేయనుంది.
రాబోయే మూడు సంవత్సరాలలో.. జాతీయ జనాభా లెక్కలు, కులగణన, డీలిమిటేషన్ జరగనుండటంతో పార్లమెంట్ స్థానాలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల సీట్ల సంఖ్యలో పెరుగుదల నమోదు కానుంది. ఈ మార్పుల క్రమంలో చివరకు 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలలో మూడింట ఒకవంతు మహిళలకు రిజర్వ్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా మహిళా రిజర్వేషన్ చట్టం లేదు. మొత్తం మీద 2029 నాటికి భారీగా రాజకీయ, సామాజిక, ఆర్థికమార్పులు జరగనున్నాయి. భారతదేశం అప్పటికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలామంది ఈ అపారమైన మార్పును గుర్తించలేరు.
జనాభా లెక్కలు
భారతదేశంలో చివరిసారి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు 2011లో జరిగాయి. ఆ తరువాత పలు కారణాల రీత్యా జన గణన జరగలేదు. వచ్చే ఏడాది జరగనున్న కొత్త జనాభా లెక్కల అనంతరం భారతదేశపు జనాభా సంఖ్యలో అపారమైన పెరుగుదల అధికారికంగా నమోదు కానుంది. విదేశీ వలసదారుల అక్రమ ప్రవాహం, జనాభా పెరుగుదలతో ప్రాంతీయ అసమానతలు, ప్రజలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, గ్రామాల నుంచి నగరాలకు ఎలా వలస వెళ్లారో కూడా జనాభా లెక్కలతో వెల్లడికానుంది. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులను పొందుతాయి.
డీలిమిటేషన్
చివరిసారి డీలిమిటేషన్ 2002లో జరిగింది. కానీ, ఇప్పుడు డీలిమిటేషన్ జరగనుంది. దీంతో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఎమ్మెల్యే, ఎంపీల నియోజకవర్గం మ్యాప్ మారుతుంది. కొత్త సీట్లు వస్తాయి. చాలా నియోజకవర్గాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది తమ సీట్లను కోల్పోతారు. ఎమ్మెల్యే, ఎంపీల సంఖ్యలో పెరుగుదల నమోదు కానుంది. తెలంగాణ, ఆంధ్రాలో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎంపీల సంఖ్యను పెంచాలని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతిపాదిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గింది. నగరాల్లో అసాధారణంగా పెరిగింది. కాబట్టి, కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది నగర ఆధారితంగా ఉంటారు. గ్రామీణ నాయకులు ప్రభావాన్ని కోల్పోతారు.
కులగణన
బ్రిటిష్ పాలకులు భారతీయ సమాజాన్ని కులం, మతం ద్వారా విభజించారు. జాతిపిత మహాత్మా గాంధీ దీనికి వ్యతిరేకంగా పనిచేశారు. కానీ, ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల తర్వాత కులగణనతో మనం కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నాం. రాజకీయాల్లో, కోర్టులలో వివాదాలు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రానుంది. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయడం జరుగుతుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన వెంటనే పురుష ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమేరకు తమ పదవులను కోల్పోవచ్చు. 33శాతం మహిళలకు, మరో 24 శాతం ఎస్సీ కులాలు, ఎస్టీ తెగలకు రిజర్వ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలలో అత్యధిక శాతం 2029లో తిరిగి అసెంబ్లీల్లో, పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం తగ్గవచ్చు.
మార్పుల ప్రభావం
ఎంపీ సీట్ల సంఖ్యలో మార్పు అంటే భారతదేశంలో అధికార మార్పు ఉంటుందని అర్థం. 1971 నుంచి రాష్ట్రాలవారీగా ఎంపీల సంఖ్య నిర్ణయించడం జరిగింది. దీంతో 1971 నుంచి ప్రతి రాష్ట్రంలో దాదాపు ఒకే సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 20శాతం ఎంపీల పెరుగుదలను ప్రతిపాదించవచ్చు. ప్రతి రాష్ట్రానికి సమానమైన పెరుగుదల న్యాయంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి దీని అర్థం పెద్ద ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం ఎంపీల సంఖ్యలో తమ వాటాను పెంచుకుంటాయి. ఇది కచ్చితంగా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల అధికార ప్రాభవాన్ని మళ్లీ యథాతథంగా పెంచేదే.
మహిళా రిజర్వేషన్ చట్టం వల్ల చాలా కాలంగా స్థిరపడిన నాయకులు రాజకీయాల నుంచి కనుమరుగు అవుతారు. పోటీ చేయడానికి సీట్లు ఉండవు. అంటే సీనియర్ నాయకుల ఉనికి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీ సీట్లు నిరంతరం మారుతూ ఉంటాయి. రాజకీయ పార్టీలు కలిగి ఉన్నవారు తప్ప సీనియర్ నాయకులు ఎవరూ రాజకీయాల్లో నిరంతరం కొనసాగలేరు. ప్రజలు నాయకులతో సంబంధాలను కోల్పోతారా లేదా అనేది చూడాల్సిన అంశం. చాలామంది ధనవంతులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుంది.
గొప్ప నాయకుల ప్రభావానికి ముగింపు
ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఉన్నట్టుగానే భారతదేశంలోనూ 40 నుంచి 50 సంవత్సరాల అనుభవం ఉన్న శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు వారి ప్రభావం ముగుస్తుంది. ఫాస్ట్ ఫుడ్లాగ మనకు స్వల్పకాలిక ఫాస్ట్ లీడర్లు వస్తారు. ఇది దేశంపై స్థానిక ప్రభావాన్ని చూపుతుంది. కచ్చితంగా కులగణన ప్రభావం చూపుతుంది. మన రాజకీయ నాయకులు విభజనలు లేవని నిర్ధారించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారనే దానిపై వారి మనుగడ ఆధారపడి ఉంటుంది. సమాజంలోని ప్రతివర్గం సంతృప్తిచెందేలా చూసుకోవడంలో సుప్రీంకోర్టు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జనాభా గణన ఈ దేశంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో వెల్లడిస్తుంది.
జరగబోయే మార్పులను జాగ్రత్తగా నిర్వహించాలి
లక్షలాది మంది బెంగాలీలు, ఒడియాలు, బిహారీలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు. వారిని దక్షిణాది రాష్ట్రాలలో ఓటు వేయడానికి అనుమతించడం మంచిదా.. కాదా అనేది లాజికల్‌గా మారవచ్చు. గొప్ప నిర్మాణం ఏదైనా నిర్మించడానికి శతాబ్దాల కాలం పడుతుంది. కానీ, దానిని నాశనం చేయడానికి కొంచెం సమయం మాత్రమే సరిపోతుంది. మూడు గొప్ప సామ్రాజ్యాలు, అంటే టర్కిష్, రష్యన్, ఆస్ట్రియన్ సామ్రాజ్యం వందల సంవత్సరాలుగా ఉన్నాయి. కానీ, 1918లో జరిగిన ఒక సాధారణ తప్పు వల్ల అవి నాలుగు సంవత్సరాలలోపు ముగిశాయి. భారతదేశంలో జరగబోయే రాజకీయ మార్పులను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. రాబోయే రాజకీయ మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలలో దాదాపుగా 15% మందికి మాత్రమే వారి పదవులు తిరిగి వస్తాయని అంచనా వేయవచ్చు.
మార్పు నిరంతరం
గొప్ప గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ 2500 సంవత్సరాల క్రితం ‘మార్పు అనేది ఒక స్థిరమైనది’ అన్నాడు. మార్పు నిరంతర ప్రక్రియ దాన్ని ఆపలేమని ఆయన వ్యాఖ్యలకు అర్థం. మనకు తెలియకుండానే భారతదేశంలో అత్యంత భారీ రాజకీయ, సామాజిక మార్పులు జరగబోతున్నాయి. అంటే, రాబోయే మూడు సంవత్సరాలలో భారతదేశం భారీ మార్పులను ఎదుర్కోనుంది . ఆ మార్పు భారతదేశానికి సానుకూలంగా ఉంటుందా లేదా ప్రతికూలంగా ఉంటుందా అనేది కాలమే చెబుతుంది.
డా.పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్