సెకండ్ డోస్ ఎప్పుడో.. వ్యాక్సిన్ కోసం జనం పాట్లు

సెకండ్ డోస్ ఎప్పుడో.. వ్యాక్సిన్ కోసం జనం పాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌‌ సెకండ్‌‌ డోస్‌‌ కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఇచ్చిన టైమ్ పూర్తవుతుండటంతో తెల్లవారుజాము నుంచే సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్‌‌ను ఎక్కువగా ప్రైవేట్ సెంటర్లలో తీసుకోవడం, 10 రోజులుగా ప్రైవేట్ సెంటర్లలో వ్యాక్సిన్ స్టాక్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మూడ్రోజులగా ప్రైవేట్ సెంటర్లలో తాత్కాలికంగా వ్యాక్సినేషన్‌‌ను సర్కారు నిలిపేయడంతో మరింత భయపడుతున్నారు. రెండో డోస్​కోసం సర్కారు సెంటర్లకు వస్తున్నారు. లైన్లలో నిలుచోలేక ముసలివాళ్లు వెనుదిరుగుతున్నారు. 

3 లక్షల మంది గడువు దాటింది

ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో కలిపి ఇప్పటివరకూ 47,87,674 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 6,29,637 మంది మాత్రమే సెకండ్ డోసు తీసుకున్నారు. మిగిలిన వాళ్లకు రాబోయే 50 రోజుల్లో సెకండ్ డోసు వేయాలి. ఇందులోనూ 10 లక్షల మందికి మరో 20 రోజుల్లో సెకండ్ డోసు షెడ్యూల్ ఉంది. ఇప్పటికే షెడ్యూల్ గడువు దాటి 3 లక్షల మంది సెకండ్ డోస్‌‌ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ర్ట సర్కారు దగ్గరున్న డోసులను వీళ్లకు ఇచ్చే అవకాశం ఉన్నా సర్కారు సరైన నిర్ణయం తీసుకోవట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 9 లక్షల 87 వేల 174 మంది రెండో డోస్‌‌ తీసుకోవాల్సి ఉంది. 2 లక్షల మందికి ఇప్పటికే సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రెండో డోస్‌‌ తీసుకోవాల్సిన వాళ్లు 3 లక్షల మందిపైనే ఉన్నారు. 

20 రోజులుగా కొవాగ్జిన్ బంద్

గత 20 రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లలో కొవాగ్జిన్ దొరకట్లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 2 లక్షల30 వేల మంది కొవాగ్జిన్ వేసుకున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మందికి సెకండ్ డోస్ అందలేదు. ఎప్పుడిస్తారో క్లారిటీ లేదు. కొవిషీల్డ్ ఇప్పటిరవకు 13 లక్షమంది తీసుకున్నారు. ఇందులో మూడు లక్షల మంది సెకండ్ డోస్ వేసుకున్నారు. 

ఫస్ట్ డోస్ ఇప్పట్లో కష్టమే

గత రెండ్రోజులుగా వ్యాక్సినేషన్ పూర్తిగా బందయింది. వ్యాక్సిన్ ఎప్పుడుస్తుందో, ఎన్ని డోసులు వస్తాయో పొద్దున సెంటర్లకు వచ్చే వరకు కూడా జిల్లాల వైద్యాధికారులకు సమాచారం ఉండట్లేదు. దీంతో వీళ్లు వ్యాక్సిన్‌‌ ఎప్పుడొస్తుందో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ముందుగా సెకండ్ డోస్ ఇచ్చాకే ఫస్ట్​డోస్ ప్రారంభించనున్నారు. సోమవారం కూడా ప్రైవేట్‌‌లో వ్యాక్సినేషన్ జరిగే అవకాశం లేదు. రాష్ర్టంలో ప్రస్తుతం రెండున్నర లక్షల వ్యాక్సిన్ డోసులు ఉండగా సోమవారం మరో రెండున్నర లక్షల డోసులు రానున్నాయి. 

గైడ్​లైన్స్‌‌తో జనం ఆందోళన

కొవాగ్జిన్ ఫస్ట్‌‌ డోస్‌‌ తీసుకున్నాక 4 నుంచి 6 వారాల్లో సెకండ్‌‌ డోస్‌‌ తీసుకోవాలని, కొవిషీల్డ్ 6 నుంచి 8 వారాల్లో తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో టైమ్‌‌ పూర్తవుతున్న వాళ్లు డైలీ వేలల్లో ఉంటున్నారు. వ్యాక్సిన్​ తీసుకోకుంటే ఏమవుతుందోనని భయపడి సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం సెంటర్లకు వస్తున్న వాళ్లలో సెకండ్ డోస్‌‌ తీసుకునే వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఫస్ట్ డోస్ కోసం వచ్చినవాళ్లు సెకండ్ డోస్ కష్టాలు చూసి వెనుదిరుగుతున్నారు. 
హయత్‌‌నగర్‌‌కు చెందిన చౌదర్ రెడ్డి 50 రోజుల క్రితం ఎల్బీనగర్‌‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో కొవాగ్జిన్ తీసుకున్నాడు. రెండో డోస్‌‌ను 4 నుంచి 6 వారాల్లోపు తప్పనిసరి వేసుకోవాలన్నారు. ఈ మధ్య ఆయన రెండో డోస్ కోసం అలా నాలుగైదు సార్లు హాస్పిటల్‌‌కి వెళ్లినా స్టాక్ లేదన్నారు. ఫస్ట్‌‌ డోస్‌‌ వేసుకొని 50 రోజులు దాటినా టీకా ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. డాక్టర్లు కచ్చితంగా రెండో డోస్​ వేసుకోవాలని చెప్పడంతో ఆందోళన చెందుతున్నాడు.  

సెకండ్ డోస్‌‌తో 80 శాతం ఇమ్యూనిటీ

సెకండ్ డోస్ తీసుకున్న తరువాతే 80 శాతం ఇమ్యూనిటీ వస్తుంది. వారం, రెండు వారాలు లేటైనా కంగారు పడొద్దు. వ్యాక్సినేషన్ స్పీడప్‌‌ చేయాలేంటే రాష్ట్రంలో రోజూ 4 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి.
- డాక్టర్​ విజయ్​ భాస్కర్, ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ చైర్మన్‌‌