పిల్లలు, మహిళలు, డయాబెటిస్​ పేషెంట్లకు స్పెషల్​ ఐటమ్స్

పిల్లలు, మహిళలు, డయాబెటిస్​ పేషెంట్లకు స్పెషల్​ ఐటమ్స్
  • డంగోరియా చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో  పనిచేస్తున్న సంస్థ
  • పౌష్టికాహారం తయారీలో మహిళలకు ఉచిత శిక్షణ​
  • చిరుధాన్యాలతో ఎన్నెన్నో వెరైటీలు
  • పిల్లలు, మహిళలు, డయాబెటిస్​ పేషెంట్లకు స్పెషల్​ ఐటమ్స్
  •  ఆర్డర్​పై  ప్రొడక్ట్స్ సప్లై

మెదక్, నర్సాపూర్​, వెలుగు:  కరోనా కాలం నుంచి జనాల్లో  హెల్దీ ఫుడ్​పై అవగాహన పెరిగింది.  ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు చిరుధాన్యాల ఆహారంపై  ఆసక్తి చూపుతున్నారు. జనాలకు  న్యూట్రిషియస్​ ఫుడ్​ అందించడమే లక్ష్యంగా   మెదక్‌‌‌‌ జిల్లా నర్సాపూర్‌‌‌‌లో  డంగోరియా చారిటబుల్‌‌‌‌ ట్రస్టు  ‘మహిళా ఉద్యోగ్‌‌‌‌’  పనిచేస్తోంది.   ఈ ఫుడ్​ ప్రాసెసింగ్​,  తయారీ, శిక్షణ కేంద్రంలో  మిల్లెట్స్​ (చిరుధాన్యాల)తో  తక్కువ ఖర్చులో  పోషకాహార పదార్థాలు తయారు చేస్తున్నారు.   నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్(జాతీయ పోషకాహార సంస్థ)​ రిటైర్డ్​ సైంటిస్ట్​ మెహతాబ్‌‌‌‌ ఎస్‌‌‌‌ బామ్జీ పర్యవేక్షణలో  ‘మహిళా ఉద్యోగ్​’  సంస్థలో  పూర్తిగా చిరుధాన్యాలతో మల్టీ గ్రేన్​ మిక్స్​, న్యూట్రీ మిక్స్​వంటి అనేక రకాల హెల్దీ ప్రొడక్ట్స్​ తయారుచేస్తున్నారు.  ఉప్మా,  కేసరి, ఖీర్‌‌‌‌, దోశ, ఇడ్లీ  మిక్స్​లను కూడా జనాలకు అందుబాటులో ఉంచుతున్నారు.  తేలికగా జీర్ణమవడంతోపాటు, శరీర ఎదుగుదలకు,  ఎముకల పటిష్ఠతకు, రక్త వృద్ధికి దోహదపడే రాగి మాల్ట్​ తయారు చేస్తున్నారు.  శిశువులు, కౌమార దశ పిల్లలు, గర్భిణులు, బాలింతలు,  డయాబెటిస్​ పేషెంట్లకు ఈ ఫుడ్​వరమే.  బాడీకి  ఐరన్​, జింక్​ వంటి సూక్ష్మ పోషకాలు అందేలా బొంబాయి రవ్వకు సజ్జలు, మక్కజొన్నలు, జొన్నలు, తైదలు, శనగపప్పు, పల్లీలు కలిపి   మల్టీ గ్రేన్​ మిక్స్​ చేస్తున్నారు. ఇది డయాబెటిస్​ సమస్య ఉన్న వారితోపాటు, ఏడు నెలలు వయసు నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తినగలిగే సూపర్​ఫుడ్​ అని  తయారీదారులు చెబుతున్నారు.  చిరుధాన్యాలతో బిస్కెట్లు కూడా తయారు చేస్తున్నారు. షుగర్​ ఉన్న వారు రోజూ 3 నుంచి 4 బిస్కెట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.  చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ‘పోషణ’ పేరుతో  ప్రోడక్ట్స్​ ఉన్నాయి.  వీటితో పాటు మామిడి, లెమన్​ వాటర్​, పుట్నాలు, పుదీనా, కరివేపాకు పౌడర్లు అమ్ముతున్నారు.

లేటెస్ట్​ మిషన్లతో తయారీ..

చిరుధాన్యాలతో  పోషకాహార మిశ్రమాలు,  ఇతర ప్రోడక్ట్స్​ తయారు చేసేందుకు అవసరమైన మిషనరీలు సమకూర్చారు. బిస్కెట్​ తయారీ మిషన్,​  డ్రమ్‌‌‌‌ రోస్టర్‌‌‌‌,  సోలార్‌‌‌‌ డ్రయర్‌‌‌‌, వేపుడు చేసే యంత్రం మహిళా ఉద్యోగ్‌‌‌‌ సంస్థలో అందుబాటులో ఉన్నాయి.  వీటిని వాడే సమయంలో సీనియర్‌‌‌‌ సైంటిస్ట్​ వీవీఎస్‌‌‌‌ మూర్తి సలహాలు ఇస్తారు. 

మహిళలకు ఫ్రీగా ట్రైనింగ్..

మహిళా ఉద్యోగ్​ సంస్థలో  పోషకాహార పదార్థాల తయారీపై మహిళలకు ఫ్రీగా ట్రైనింగ్​ ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 మందికి పైగా శిక్షణ పొందారు.  వీరు సొంతంగా ప్రొడక్ట్స్​ తయారుచేసి అమ్ముతూ సెల్ఫ్​ ఎంప్లాయ్​మెంట్​ కూడా 
పొందుతున్నారు. 

సొసైటీకి అవార్డులు..

పోషకాహార తయారీలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా ఉద్యోగ్‌‌‌‌  సొసైటీకి పలు అవార్డులు దక్కాయి.  సొసైటీ నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించే మెహతాబ్‌‌‌‌ ఎస్‌‌‌‌ బామ్జీకి  అంతర్జాతీయ పోషకాహార  సంస్థ నుంచి లైఫ్‌‌‌‌ టైం అఛీవ్‌‌‌‌మెంట్‌‌‌‌,  పోషక్‌‌‌‌ అనాజ్‌‌‌‌ అవార్డులు వచ్చాయి. జాతీయ పోషకాహార సంస్థ ఉత్తమ శాస్త్రవేత్తగా గుర్తించి సన్మానించింది. 

సొంతంగా మార్కెటింగ్‌‌‌‌..

నర్సాపూర్‌‌‌‌లో డంగోరియా చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలోని   ‘మహిళా ఉద్యోగ్​’  తయారు చేసిన  ప్రొడక్ట్స్​  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సూపర్​ మార్కెట్లకు సప్లై చేయడంతోపాటు, హైదరాబాద్​లోని రామకృష్ణ మిషన్‌‌‌‌, ఎల్వీ ప్రసాద్‌‌‌‌ ఐ హాస్పిటల్, ఫెర్నాండేజ్ హాస్పిటల్​, డంగోరియా హాస్పిటల్స్​కు సప్లై చేస్తున్నారు. తార్నాకలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ న్యూట్రిషన్​కు కూడా సప్లై చేస్తున్నారు. ఆయా సంస్థలు నిర్వహించే సదస్సుల వద్ద స్టాల్స్​ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.  కంపెనీలు, ఇన్​స్టిట్యూట్లు, హాస్పిటల్స్​తో  పర్సనల్​గా ఆర్డర్​ చేసినా వారికి అవసరమైన  ప్రోడక్ట్స్​ తయారు చేసి ఇస్తున్నారు.

మహిళలకు ప్రాధాన్యం.. 

అన్ని వయస్సుల ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే మా లక్ష్యం.  వివిధ కారణాల వల్ల మహిళలకు   న్యూట్రిషియన్​ ఫుడ్​ ఎక్కువగా అవసరం పడుతుంది. కాబట్టి మా ప్రోడక్ట్స్​ కూడా ఎక్కువగా  మహిళలకు సంబంధించినవే ఉన్నాయి.  గర్భిణులు పోషకాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత, వాటిని తీసుకోవడం వల్ల కలిగే మేలు గురించి  అవగాహన కల్పిస్తున్నాం.
- వీవీఎస్‌‌‌‌ మూర్తి, సీనియర్​ సైంటిస్టు