వానల ముందర.. అడ్డగోలుగా తవ్వకం

వానల ముందర.. అడ్డగోలుగా తవ్వకం
  • సమ్మర్​లో సైలెంట్​గా ఉండి ఇప్పుడు పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్లు
  • పూర్తయ్యాక మట్టితో పూడ్చి వదిలేస్తున్నారు
  • తొలకరి వానకే రోడ్లన్నీ బురదమయం
  • తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరిస్తున్న బల్దియా ఉన్నతాధికారులు

హైదరాబాద్, వెలుగు: సమ్మర్​లో చేయాల్సిన పనులను ఇప్పుడు చేస్తుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వానా కాలం మొదలవక ముందే రోడ్లు, సెల్లార్ల తవ్వకాలు బ్యాన్ చేసినప్పటికీ ఆగడం లేదు. మొన్నటి దాకా సైలెంట్​గా ఉండి, ఇప్పుడు వాటర్, డ్రైనేజీ పైప్​లైన్లు, కేబుల్స్​పనులంటూ కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు. కొన్నిచోట్ల పనులయ్యాక మట్టితో పూడ్చి, మరికొన్ని చోట్ల అది కూడా చేయకుండా వదిలేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులు, మోస్తరు వానలకు ఎక్కడికక్కడ రోడ్లు బురదమయం అవుతున్నాయి. రోడ్డు తవ్వాలంటే జీహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని, గతేడాది నుంచి తప్పనిసరి చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్లు కేర్​చేయడం లేదు. అడ్డగోలుగా రోడ్లు తవ్వేసి వదిలేస్తున్నారు. దీంతో కాలనీల్లో వెహికల్స్​తిరగలేని పరిస్థితి ఉంటోంది. కొన్నిచోట్ల వెహికల్స్​దిగబడుతున్నాయి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్​నిలుస్తోంది.

మట్టిపోసి మమా..

మెయిన్​రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలోని రోడ్లను తవ్వేసి రోజులు గడుస్తున్నా రిపేర్లు చేయడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కి.మీ మేర రోడ్లు విస్తరించి ఉండగా, ఇందులో 2,846 కి.మీ మేర బీటీ రోడ్లు, 6,167 కి.మీ మేర అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్గత రోడ్లన్నీ దారుణంగా మారాయి. దాదాపు 2 వేల కి.మీ మేర డ్యామేజ్ అయి ఉన్నాయి. ఎవరికి కావాల్సిన విధంగా వాళ్లు తవ్వుకుంటూ పోతుండడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. స్థానిక రోడ్ల ఇబ్బందులపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. టోలిచౌకి, మెహిదీపట్నం, మాదాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కార్వాన్, మన్సూరాబాద్, జియాగూడ, షేక్ పేట తదితర ప్రాంతాల్లో రోడ్లను అడ్డగోలుగా తవ్వేశారు. కనీసం రిపేర్లు కూడా చేయడం లేదు. 

పెరుగుతున్న ఫిర్యాదులు

వానలకు ముందే కేబుల్స్, వాటర్, డ్రైనేజీ లైన్ల పనులు చేసి ఉంటే.. ఈపాటికి రిపేర్లు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు హడావిడిగా తవ్వి వదిలేస్తే వర్షపు నీరు నిలిచి గుంతలు ఏర్పడుతున్నాయి. తమ పరిధిలో రోడ్లు తవ్వుతున్నారన్న విషయం కూడా సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు తెలియడంలేదు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్ల సమస్యలు కామన్ గా మారాయి. తవ్వి నెలలు గడిచినా రోడ్లు తిరిగి వేయడంలేదని జనం నుంచి జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. టోలిచౌకి వంటి ప్రాంతాల్లో ఏడాదిలో ఐదారుసార్లు రోడ్లు వేసి బిల్లులు లేపుతున్నా.. ప్రస్తుతం గుంతలే ఉన్నాయి. 

బిల్లులు ఆపే అధికారం ఉన్నా..

గ్రేటర్ రోడ్లపై ఎలాంటి పనులు చేపట్టాలన్నా వివిధ డిపార్ట్ మెంట్ల నుంచి ఎన్ఓసీలు తీసుకోవాలి. పనులు పూర్తయ్యాక తిరిగి రోడ్లు వేసే బాధ్యత సదరు కాంట్రాక్టర్​పై ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ రోడ్లు వేయకపోతే పనులకు సంబంధించిన బిల్లులను ఆయా డిపార్ట్​మెంట్ల అధికారులు ఆపేయచ్చు. కానీ ఈ విషయాన్ని ఏ ఒక్క డిపార్ట్​మెంట్​పట్టించుకోవడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కాంట్రాక్టర్లు రోడ్లను బాగు చేయకుండానే చేతులు దులుపుకుంటున్నారు. చాలాచోట్ల పనులకు ఎన్ఓసీలు తీసుకోకుండానే, రాత్రికి రాత్రే తవ్వి మట్టితో పూడ్చేస్తున్నారు. 

తవ్వి రెండు నెలలు అవుతుంది

తవ్విన చోట వానలు పడక ముందే రోడ్లు వేస్తే బాగుండేది. ఇప్పుడు చిన్నవానకే ఇబ్బందులు పడుతున్నాం. గత బుధవారం రాత్రి కురిసిన వానకు రోడ్లు బురదమయం అయ్యాయి. టోలిచౌకి నుంచి బంజారాహిల్స్ వచ్చే రూట్ లో రెండు నెలల కిందట వేర్వేరు పనుల కోసం రోడ్డును తవ్వారు. పనులు అయిపోయాక తిరిగి రోడ్డు వేయలేదు. డైలీ ఇదే రూట్​లో ట్రావెల్​చేస్తాను. వాన పడితే వెహికల్స్​వెళ్లడం కష్టంగా ఉంటోంది.
– జనార్దన్ రెడ్డి, ప్రైవేట్ ఎంప్లాయ్