కలెక్టరేట్‌లో ధరణి ఫైల్స్ కదలట్లే..

కలెక్టరేట్‌లో ధరణి ఫైల్స్ కదలట్లే..
  •     భూ సమస్యల పరిష్కారంలో జాప్యం 
  •     మీసేవలో దరఖాస్తు చేసినా ఫలితం లేదు 
  •     కలెక్టరేట్​చుట్టూ తిరుగుతున్న బాధితులు 
  •     గ్రీవెన్స్​లో భూసమస్యలపైనే ఎక్కువ పిటిషన్లు 

 మంచిర్యాల, వెలుగు: కలెక్టరేట్‌లో ధరణి ఫైల్స్ పేరుకుపోతున్నాయి. నెలలు గడుస్తున్నా భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు,  పట్టాదారు పేర్ల తప్పులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, బ్లాక్ లిస్ట్ తదితర కరెక్షన్స్ కోసం మీసేవలో, గ్రీవెన్స్ లో అప్లై చేసుకొని పరిష్కారం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కొత్త కలెక్టర్ వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ధరణి ఫైల్స్ ముట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పదిహేను రోజులుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కలెక్టర్ తోపాటు అధికారులు బిజీగా ఉన్నారు.  ఈ నెల 22 వరకు ఉత్సవాలు కొనసాగనుండడంతో ఇప్పట్లో భూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని వాపోతున్నారు. 

ధరణి తప్పులతో తిప్పలు...

రాష్ర్ట ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారం పేరిట 2017లో ఇంటిగ్రేటెడ్​ల్యాండ్​రికార్డ్స్​మేనేజ్​మెంట్​సిస్టమ్​(భూరికార్డుల ప్రక్షాళన)ను చేపట్టింది. దాని ప్రకారం ల్యాండ్​రికార్డులను ఆన్​లైన్​చేస్తూ ధరణి పోర్టల్​ను తీసుకొచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో  రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పట్టదారుల పేర్ల మార్పు, ఇంటి పేర్ల మార్పు, మిస్సింగ్​సర్వేనంబర్లు, సర్వేనంబర్లు మారడం, పట్టా భూములు, అసైన్డ్​భూములు ప్రభుత్వ భూములుగా రికార్డు చేసి బ్లాక్​లిస్టులో పెట్టడం ఇలా అనేక తప్పులు జరిగాయి. అవే తప్పులు ధరణి పోర్టల్​లో నమోదయ్యాయి. ఈ తప్పుల సవరణ అధికారాలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగిస్తూ ధరణి పోర్టల్​లో 33 మాడ్యూల్స్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తప్పుల సవరణ కోసం బాధితులు మీసేవలో దరఖాస్తు చేసుకుంటే అవి నేరుగా కలెక్టర్​లాగిన్​లోకి వెళ్తాయి. వీటిపై తహసీల్దార్లు, ఆర్డీవోలు ఎంక్వయిరీ చేసి రిపోర్టు సమర్పిస్తే వాటి ప్రకారం కలెక్టర్​కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది.  ఇంతకుముందున్న కలెక్టర్​భారతి హోళికేరి ఎప్పటికప్పుడు ధరణి దరఖాస్తులను పరిశీలించి క్లియర్​చేసేవారని చెబుతున్నారు. కొత్త కలెక్టర్​ సంతోష్​ వచ్చినప్పటి నుంచి ధరణి ఫైల్స్​ను పెండింగ్​లో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇటీవల కొన్ని ఫైళ్లను పరిశీలించి  ప్రొసిడింగ్స్​జారీ చేసినప్పటికీ తుది పరిష్కారం చూపకుండా పెండింగ్​లో పెట్టారని అంటున్నారు.  దీంతో పలుమార్లు గ్రీవెన్స్​లో పిటిషన్లు ఇచ్చినప్పటికీ ఫలితం లేదంటున్నారు.  కలెక్టర్​ స్పందించి ధరణి ఫైల్స్​ను ఎప్పటికప్పుడు క్లియర్​చేయాలని కోరుతున్నారు. 

 తప్పుడు సమాచారం ఉన్నా పట్టా ఇచ్చిండ్రు 

ఊరు మందమర్రి శివారు సర్వేనంబర్​92/3/2లో మాత నాగుల చిన్నయ్య పేరిట 25 గుంటల భూమి ఉంది. 2014 వరకు మా తాత పేరిట ఉన్న భూమి 2016లో నాగుల అంజయ్య పేరు మీదకు మారింది. ఈ విషయం తెలిసి ఆర్టీఐ ద్వారా తహసీల్దార్​కు దరఖాస్తు చేశారు. నాగుల చిన్నయ్యకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, అందరూ చనిపోయినట్టు రికార్డు సృష్టించి తహసీల్దార్​కు తప్పుడు సమాచారం ఇచ్చి అంజయ్య తన పేరిట పట్టా చేయించుకున్నాడు. దొంగ పట్టాను క్యాన్సల్​చేసి చిన్నయ్య వారసులకు పట్టా చేయాలని కోరుతూ కలెక్టరేట్​చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 
 ఇంటి పేరు మార్చుతలేరు.... ములకల్ల వీరక్క, సుందరశాల
నాకు చెన్నూర్​ మండలం సుందరశాల శివారు సర్వేనంబర్​ 303/1లో 4 ఎకరాల 6 గుంటల భూమి ఉంది. మా ఇంటి పేరు ములకల్ల అయితే ధరణిలో వేమునూరి అని తప్పుగా నమోదు అయింది. ఇంటి పేరు సరిచేసి కొత్త పట్టా పాస్​బుక్​ ఇవ్వాలని మీ సేవలో దరఖాస్తు చేసుకున్న.  ఈ చిన్న పని చేయడానికి కూడా సతాయిస్తున్నరు. 
నాగుల కార్తీక్ (చిన్నయ్య మనుమడు), ఊరు మందమర్రి  

దొంగ పట్టా క్యాన్సల్​ చేస్తలేరు..  

చెన్నూర్​మండలం కోనంపేట గ్రామ శివారు సర్వేనంబర్​63లో 8 ఎకరాల 10 గుంటల మా జాయింట్​పట్టా భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో కుంభం మనోహరాబాయి దొంగ పట్టా చేయించుకుంది. మా ప్రమేయం లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా అధికారులు ఆమెను పట్టాదారుగా ధ్రువీకరించి డిజిటల్​సైన్ చేసి పాస్​బుక్​ ఇచ్చారు.   పట్టాదారులైన మమ్మల్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అక్రమంగా రైతుబంధు తీసుకుంటోంది. ఇది దొంగ పట్టాగా ధ్రువీకరిస్తూ పట్టా క్యాన్సల్​చేస్తామని ఆ తర్వాత వచ్చిన అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్​కు పలుమార్లు గ్రీవెన్స్​లో, వ్యక్తిగతంగా పిటిషన్లు ఇచ్చినా ఫలితం లేదు.  దొంగ పట్టా చేసిన అప్పటి చెన్నూర్​తహసీల్దార్​పై యాక్షన్​ తీసుకోవాలి.  
- షేక్​జంషీద్, చెన్నూర్