ప్రతిపక్షం ఉండాల్సిందే..మెజారిటీ జనం అభిప్రాయం

ప్రతిపక్షం ఉండాల్సిందే..మెజారిటీ జనం అభిప్రాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండాల్సిందేనని ప్రజలు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఉండాలని 56.7 శాతం మంది తేల్చి చెప్పారు. కేవలం 20.8 శాతం మంది మాత్రమే ప్రతిపక్షాలు అవసరం లేదన్నారు. అయితే ప్రతిపక్షాలు తగిన భరోసా కల్పించలేకపోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీల్లో నేతల మధ్య కుమ్ములాటలు, హైకమాండ్​ పై ఆధారపడటం, ప్రజా సమస్యలపై సమర్థంగా పోరాటడలేకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్​ సర్కారు పాలనపై అసంతృప్తి ఉన్నా ఇతర పార్టీలకు మద్దతు పెరగకపోవడానికి ఇవే కారణమని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకుంటున్నట్టు మెజారిటీ జనం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 44 ఏండ్లలోపు వారిలో చాలా మంది బీజేపీనే ఆప్షన్​గా చూస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్​ను రెండో ఆప్షన్​గా చూస్తున్నారు.

అవసరం లేదన్నది 20.8 శాతమే..

  • ప్రతిపక్షం ఉండాలా, వద్దా అన్న అంశంపై అభిప్రాయం కోరగా.. సర్వేలో పాల్గొన్నవారిలో 56.7 శాతం మంది ప్రతిపక్షం ఉండాల్సిందేనని చెప్పారు,20.8 శాతం మంది ప్రతిపక్షాలు ఉండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 22.5 శాతం మంది ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు.
  • ఇక ప్రతిపక్షం అవసరం లేదని అభిప్రాయపడిన 20.8 శాతం మందిలోనూ.. 8.2 శాతమే ఆ వాదనను గట్టిగా సమర్థించగా, మిగతా 12.6 శాతం మంది కొంతవరకు అవసరం లేదన్నారు.
  • ప్రతిపక్షాలు ఉండాల్సిందేనని పేర్కొన్న 56.7 శాతం మందిలో ఏకంగా 40.6 శాతం ఈ విషయాన్ని గట్టిగా సమర్థించారు. 16.1 శాతం ప్రతిపక్షాలు ఉండటమే మేలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
  • ప్రతిపక్షం అవసరం లేదన్నవారి కంటే ఆ వాదనను సమర్థించకుండా ఏమీ చెప్పలేమన్నవారు కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే..!

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను ఎవరు సమర్థవంతంగా పోషిస్తున్నారన్న ప్రశ్నకు మెజారిటీ జనం బీజేపీకే ఓటేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44.2 శాతం మంది బీజేపీయే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని, సర్కారుపై పోరాటం చేస్తోందని చెప్పారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్​ పార్టీకి కూడా 42.5 శాతం మంది సపోర్ట్​ చేశారు. మరో విషయం ఏమిటంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు పెద్దగా యాక్టివ్​గా ఉండటం లేదని.. అధికారంలో టీఆర్​ఎస్​ పార్టీ నేతలే ప్రతిపక్ష పాత్రనూ పోషిస్తున్నారని 6.4 శాతం మంది పేర్కొనడం గమనార్హం. ప్రజా సమస్యలపై పోరాడుతాయని పేరున్న కమ్యూనిస్టులకు 1.7 శాతం, టీడీపీకి 0.7 శాతం, జనసేనకు 0.6, టీజేఎస్​కు 0.6, ఎంఐఎంకు 0.4 శాతం మంది ఓటేశారు. మొత్తంగా 2.8 శాతం మంది ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు.

భరోసా ఇవ్వలేకపోతున్న ప్రతిపక్షాలు

రాష్ట్రంలో టీఆర్​ఎస్​ సర్కారుపై అసంతృప్తి ఉన్నా.. ప్రతిపక్షాలు తగిన భరోసా ఇవ్వలేకపోవడం వల్లే ప్రజలు టీఆర్ఎస్​ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్షాల్లో ఏ అంశాలను మీరు తప్పుపడుతున్నారని ప్రశ్నించగా.. తగిన భరోసా కల్పించలేకపోవడం, పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు, అధికారమే లక్ష్యమన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు వంటివే కారణమని చాలా మంది చెప్పారు.

44 ఏండ్లలోపు వారు బీజేపీ వైపే

  • సర్వేలో పాల్గొన్నవారిలో వయసును బట్టి చూస్తే.. 44 ఏండ్లలోపు వాళ్లలో చాలా మంది బీజేపీయే సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఆ పై వయసు వారిలో కాంగ్రెస్​కు మద్దతు కనిపించింది.
  • సర్వేలో పాల్గొన్నవారిలో 45 శాతం మంది బీజేపీయే ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని చెప్పగా.. ఇందులో 18 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న వారు 6.4 శాతం, 25–34 మధ్య వాళ్లు 15%, 35–44 మధ్య వాళ్లు 10.2%, 45–54 మధ్య వాళ్లు7%, 55–64 మధ్య వారు 3.7%, 65 ఏండ్లు పైబడిన వాళ్లలో 2.8 శాతం ఉన్నారు.
  • ప్రతిపక్షంగా కాంగ్రెస్​కు  42 శాతం వరకు సపోర్ట్​ చేయగా.. ఇందులో 18 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న వారు 5.2 శాతం, 25–34 మధ్య వారు 12%, 35–44 మధ్య వాళ్లు 9.2%, 45–54 మధ్య వారు 7.1%, 55–64 మధ్యవాళ్లు 4%, 65 ఏండ్లు పైబడిన వాళ్లలో 3.2 శాతం ఉన్నారు.
  • కమ్యూనిస్టులకు కూడా 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల మధ్య వయసువారిలో కొంత మద్దతు కనిపించింది. లెఫ్ట్​ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని చెప్పిన 1.7 శాతం మందిలో సగం మందికిపైగా 44 ఏండ్లలోపు వాళ్లే..
  • ఎంఐఎం, టీడీపీ, జనసేన, టీజేఎస్​ పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయని చెప్పినవారిలో చాలా వరకు 44 ఏండ్లలోపువారే..